ఈ దేశంలో ఒక వర్గం ఆనందంగా ఇంట్లో ఉంటూ లాక్ డౌన్ని స్వాగతించింది. వారికి తరాలకు  సరిపడ సంపద ఉంది. ఎన్ని నెలలు దేశం తలుపులు మూసినా కూడా వారికి ఏం కాదు, అదే పేదలు ఉన్నారు. వారు ఇట్టే  ఆకలితో బయటపడిపోతారు. ఇంకో వర్గం ఉంది. వారు మధ్యతరగతి ప్రజలు.  వారు ఒకటి రెండు నెలలు మాత్రమే తట్టుకోగలరు. వారు కూడా ఇపుడు బరస్ట్ అవుతున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఈ దేశంలో వలస కార్మికుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అంతా కోరుకుంటున్నారు. వలస కార్మికులు ఈ దేశ సంపదను పెంచుతున్నారు. నిర్మాణ రంగంలో వారు కీలకమైన భూమిక పోషిస్తున్నారు. వారు ఉంటేనే ఫ్యాక్టరీలు నడిచేది, ప్రాజెక్టులు కట్టేది, భవనాలు, విలాసాలు దర్జాలు సాగేవి. 

 

ఒక లెక్క ప్రకారం ఈ దేశంలో వలస కార్మికులు 13 కోట్ల మంది వరకూ ఉంటారని అంటారు. అంటే ఈ దేశ జనాభాలో పది శాతం మంది. అంత మందిని అలా గాలికి వదిలేసి లాక్ డౌన్ని ప్రకటించిన కేంద్రం కనీసం వారి కష్టాలని తీర్చే పనికి కూడా పూనుకోలేదు. ఈ దేశంలో వలస కార్మికుల కడగండ్లు అన్నీ ఇన్నీ కావు.

 

వారు వందలకు వందల మైళ్ళు నడచి ఇళ్లకు చేరుకున్న వారు కొందరైతే, దారిలోనే చనిపోయిన వారు మరికొందరు. ఇంక మరోవైపు చూసుకుంటే గర్భిణీలు, చిన్నారులు , మహిళలు, వ్రుధ్ధులు, వారి అగచాట్లు చెప్పనలవి కాదు. ఇలా వీరిని ఎందుకు వదిలేశారు. ఇపుడు తాపీగా కేంద్రం ప్రకటిస్తున్న ఆర్ధిక ప్యాకేజీలో వలస కార్మికుల గురించి మంచి కబుర్లు చెబుతున్నారు.

 

వలస కార్మికులు ఇలా సలసలా మరిగిపోతూంటే ఎండలను, చీకట్లను దాటుకుంటూ మరణాన్ని కోరి తెచ్చుకుంటే ఈ దేశం ఎలా చల్లగా ఉండగలదు. సాటి భారతీయుడు రైలు పట్టాల మీద నిద్రపోతూ చనిపోయారంటే వారి అలసట ముందు రైలు కూత కూడా వినిపించలేదంటే గూడ్స్ రైళ్లు వారిని చంపుకుని దాటుకుని పోయాయంటే ఇంతటి దుర్గతికి కారణమైన వారు ఎవరు అని వెతకాలి.

 

నిజంగా లాక్ డౌన్ వల్ల కరోనా కట్టడి ఎంతవరకూ అయిందో తెలియదు కానీ ఆకలి మరణాలు మాత్రం పెరిగిపోయాయి. వలస కార్మికుల చావులు ఎక్కువైపోయాయి. అవి చాలు ఈ దేశం సిగ్గు పడడానికి, ఇంత పెద్ద దేశంలో వలస కార్మికులకు చోటు లేదని ఆలోచన వచ్చినపుడు ఈ డెబ్బై ఏళ్ల స్వాతంత్రానికి అర్ధం పరమార్ధం లేవనే చెప్పాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: