రాజకీయంగా ఎటు ముందుకు వెళ్లలేని సంకట పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు పవన్ ఇద్దరూ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇద్దరూ ఏపీలో లేని సమయంలో ఇక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ ఈ రెండు పార్టీలకు మైలేజ్ తెచ్చే అంశాలే. అయినా వాటికి వీరు తమకు అనుకూలంగా మార్చుకోలేని పరిస్థితి. ఒకవైపు కరోనా వైరస్ ప్రభావం చుట్టుముట్టడంతో జగన్ అనేక ముందస్తు చర్యలు తీసుకుంటూ జనాల్లో పలుకుబడి పెంచుకుంటున్నారు. అలాగే ఇదే సమయంలో అనేకమైన అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఏపీలో పవన్, చంద్రబాబు ఉండి ఉంటే రాజకీయంగా మైలేజ్ పొందే అవకాశం ఉండి ఉండేది. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం వీరికి లేకుండా పోయింది. అయితే చంద్రబాబు మాత్రం రాజకీయంగా వెనకబడ కుండా ఉండేందుకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

IHG


ఇక పవన్ విషయానికొస్తే, సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు తప్ప ఎక్కువగా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం జరుగుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటగా గళం వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు గానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదిపేందుకు ఇష్ట పడడం లేదు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు, పదేపదే  రాయలసీమ అంటే ఎంతో మమకారం అని చెప్పుకునే పవన్ కానీ, ఈ  విషయంలో స్పందించేందుకు భయపడుతున్నారు. దీనికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే భయమే కారణం. 

 

IHG


అసలు పవన్, బాబు ఇద్దరూ ఈ సమయంలో తప్పనిసరిగా స్పందించాలి. ఎందుకంటే ఏపీ లో అధికారం దక్కించుకునే దిశగానే పవన్, చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఈ రెండు పార్టీల ఉనికి అంతంత మాత్రమే. వీరి రాజకీయాలు కూడా ఏపీ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాజకీయ విషయాల్లోనూ, సమస్యల విషయంలో పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాడు అంశంలో మాత్రం ఏపీ ప్రభుత్వానికి మద్దతు తెలపలేదు. రాయలసీమకు లబ్ది చేకూర్చే విషయంలో  ఖచ్చితంగా గొంతు ఎత్తాల్సి ఉంది. అయితే అలా చేయాలంటే  తెలంగాణ ను విమర్శించాలి. అందుకే ఈ ఇద్దరు నేతలు పూర్తిగా మౌనంగా ఉండిపోతున్నారు. 

 

IHG


బాబు, పవన్ ఇద్దరూ, ఏపీలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. పవన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే... చంద్రబాబు ప్రజా పోరాటాలు, ఉద్యమాల ద్వారా తమ పార్టీ గళం వినిపిస్తూ ఉంటారు. రాయలసీమ జిల్లాలకు తాగు సాగునీరు అందించే అత్యంత కీలకమైన విషయంలోనూ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు మౌనంగా ఉండడం వారికి ముందు ముందు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి విషయానికి సంబంధించి వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, పోతిరెడ్డిపాడు అంశం వారికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. ఒకరకంగా చెప్పుకుంటే పోతిరెడ్డిపాడు విషయంలో ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా నోరు మెదపలేని విధంగా పరిస్థితి తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: