దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో కేంద్రం లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది. కొన్ని రోజుల క్రితమే లాక్ డౌన్ ను పొడిగిస్తామని కీలక ప్రకటన చేసిన మోదీ సర్కార్ మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కీలక ప్రకటన చేయడంతో పాటు నాలుగో విడత లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం గతంలో ప్యాకేజీని ప్రకటించగా తాజాగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 
 
కేంద్రం ప్యాకేజీ వల్ల కొన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూరి ఉండవచ్చు కానీ నిజమైన బాధితులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజమైన బాధితుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ప్రస్తుతం నేషనల్ మీడియాలో, లోకల్ మీడియాలో వలస కార్మికుల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. కానీ మధ్య తరగతి వర్గాల గురించి మీడియా పట్టించుకోవడం లేదు. 
 
వలస కార్మికులు, పేదలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్యాకేజీల వల్ల, పథకాల వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు. గుమస్తాలు, ప్రైవేట్ సంస్థలు చాలీచాలని జీతంతో జీవనం సాగించేవారు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని చాలా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. కొన్ని సంస్థలు మార్చి నెల జీతాన్ని చెల్లించినప్పటికీ ఏప్రిల్ నెల జీతం విషయంలో 50 నుంచి 70 శాతం కోత పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 
 
మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక ఉద్యోగులను తొలగిస్తున్నాయి. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసేవాళ్లు, థియేటర్లు, మాల్స్ పై ఆధారపడి జీవించేవారు.... వీళ్లంతా జీతాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా మధ్య తరగతి వారికి అంత సులభం కాదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది సైతం బాధ పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి గురించి ఆలోచించి వీరికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: