ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజా కేసుల్లో కోయంబేడు మార్కెట్‌తో లింకున్నవే 19 ఉన్నాయి. మరోవైపు... ఈ నెలాఖరు వరకూ ఆలయాలను తెరిచే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచన మేరకు దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

 

కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ విధించినా... కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 52 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఏపీలో కరోనా బారిన పడ్డ వాళ్ల సంఖ్య 2 వేల 282కు చేరింది.

 

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం... తాజాగా 9 వేల 713 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో 52 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో కృష్ణాలో 15, చిత్తూరులో 15, నెల్లూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలులో 4, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెరో రెండు , విశాఖ, విజయనగరం జిల్లాల్లో చెరొకటి ఉన్నాయి. అయితే... చిత్తూరులో నమోదైన 15 కేసుల్లో 12తో పాటు నెల్లూరులో తాజా ఏడు కేసులు కూడా తమిళనాడు కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవే. ఈ 19 మంది ఇటీవల కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వచ్చిన వాళ్లే. 

 

ఏపీలో తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 94 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీళ్లలో గుంటూరులో 40, కర్నూలు 28, కృష్ణా 20, చిత్తూరు 5, తూర్పు గోదావరి 4, విశాఖపట్నం 4, అనంతపూర్ 2, కడపకు చెందిన వ్యక్తి ఒక్కరు ఉన్నారు. దీంతో కరోనా నుంచి కొలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయిన వాళ్ల సంఖ్య 1527కి చేరింది. ప్రస్తుతం 705 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనాతో ఇంత వరకూ 50 మంది చనిపోగా, తాజాగా ఒక్క మరణమూ సంభవించలేదు.

 

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకూ ఆలయాలను తెరిచేది లేదని ఏపీ సర్కార్‌ స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల ఆలయాల్లోకి భక్తులను అనుమతించబోమని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఆలయాల్లోని నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. 


 
వ్యక్తిగత దూరం పాటించడం, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం ద్వారానే కరోనా కట్టడి చేయగలమంటున్నాయి ప్రభుత్వాలు. అయితే, నిబంధనలు, అధికారుల సూచనలు పాటించని వాళ్లు కరోనా వైరస్‌ బారినపడుతున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: