గత కొన్ని రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు వరుస పెట్టి భూ కుంభకోణం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలు భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో భూ పంపిణీ విషయంలో వైసీపీ నేతలు భారీ కుంభకోణం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే మొన్న ఈ మధ్య మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు.

 

అయితే కమ్మ నేతలైన కొడాలి నాని, ఉమాలకు ముందు నుంచి పడదు అనే విషయం తెలిసిందే. ఇక వీరు గురించి కాసేపు పక్కనబెడితే...తాజాగా మరో ఇద్దరు కమ్మ నేతలకు వార్ మొదలైంది. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా సంచలన ఆరోపణలు చేశారు.  

 

పేదలకు నివేశిత స్థలాల పేరుతో శివకుమార్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డాడని, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రూ.150 కోట్లు దోచుకున్నారని అన్నారు. శివకుమార్ భూ దోపిడీకి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దీనిపై విచారణ చేపట్టకపోతే ప్రభుత్వానికి కూడా దోపిడీలో భాగం ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు.

 

ఇక ఇక్కడ ఆలపాటి రాజా భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కానీ వాటిని బయటపెట్టకుండా ప్రభుత్వమే స్వతహాగా విచారణ చేయాలని కోరడం లాజిక్ ఏంటో అర్ధం కావడం లేదు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బయటపెడితే చేసే ఆరోపణలకు ఏమన్నా అర్ధం ఉంటుంది. ఇదే సమయంలో ఈ ఆరోపణలపై శివకుమార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే టీడీపీ నేతలు ఓ స్ట్రాటజీ ప్రకారమే వైసీపీ నేతలపై భూ కుంభకోణం ఆరోపణలు చేస్తున్నట్లు అర్ధమవుతుంది.  మరి చూడాలి ఈ కుంభకోణాల గోల ఎప్పటికి ఆగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: