అగ్రకులాల్లో కూడా వెనుకబడిన ఉన్నారని, వారికి కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి గతంలో మోదీ నేతృత్వం,లోనే ఎన్డీయే-1 ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వారి కోసం 10 శాతం రిజర్వేషన్ కేటాయించారు. అయితే ఈ 10 శాతం రిజర్వేషన్‌ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం అమలు కావడం లేదు.

 

గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయించింది. మిగిలిన అగ్రకులాల వారికి 5 శాతం కేటాయించింది. అయితే ఈ రిజర్వేషన్ అమలు కాకుండానే ఎన్నికలు వచ్చేశాయి. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, జగన్ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. జగన్ అధికారంలోకి రాగానే ఈ రిజర్వేషన్లు పక్కకు వెళ్లిపోయాయి. అగ్రకులాల కోసం 10 శాతం కేటాయిస్తే, కేవలం కాపులకే 5 శాతం ఇవ్వడం కరెక్ట్ కాదని, దీని వల్ల మిగతా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి, ఈ అంశాన్ని పక్కనబెట్టారు.

 

ఇక అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్ లోనే ఉంది. అయితే తాజాగా ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం జగన్‌కి కన్నా లేఖ కూడా రాశారు. పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రస్తుత పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.

 

రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోతున్నారన్నారు. అలాగే విద్యా ప్రవేశాలతో పాటు వివిధ నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని కన్నా డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రకులాల వారికి రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల మేలు జరిగే అవకాశముంది. మరి ఈ రిజర్వేషన్ అంశంపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: