హైదరాబాద్‌ గండిపేట్‌ చెరువు ప్రాంతంలో ఓ అమెరికన్‌ అనుమాస్పద స్థితిలో చనిపోయాడు. గండిపేట్‌ లేక్‌ బ్యాక్‌ వాటర్‌ వద్ద మృతదేహం పడి ఉంది. భార్యతో కలిసి ఏడాదిన్నరగా హైదరాబాద్‌ ఉంటున్న ఈ అమెరికన్‌... రోజూ లాగే సైకిలింగ్‌కు వెళ్లి విగతజీవిగా మారాడు. 

 

అమెరికా దేశస్తులైన పాల్‌ రాబర్ట్‌ లిటిల్‌ జాన్‌, ఎర్రికా ఏంజెలీనా భార్యభర్తలు. ఈ దంపతులు ఏడాదిన్నరగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. జాన్‌కు రోజు సైక్లింగ్‌ చేసే అలవాటు ఉంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో అమెరికన్‌ ఆర్మ్‌ కియోసైనాతో కలిసి సైకిలింగ్‌కు వెళ్లేవాడు పాల్‌ రాబర్ట్‌. నిన్న వ్యక్తిగత కారణాలతో కియో సైక్లింగ్‌కు వెళ్లలేదు. దీంతో జాన్‌ ఒక్కడే ఉదయం ఏడు గంటల సమయంలో సైక్లింగ్‌కు బయల్దేరి వెళ్లాడు. కానీ మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య ఏంజెలీనా సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదని తెలిపింది. 

 

ఏంజెలీనా ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జాన్‌ మొబైల్‌ నెంబర్‌తో సాయంతో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా అతను సైక్లింగ్‌కు వెళ్లిన దారిని గుర్తించారు.  చివరకు గండిపేట్‌ చెరువు వెనక వైపు ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉన్న జాన్‌ను గుర్తించారు. వెంటనే అతని దగ్గరికి వెళ్లగా, అప్పటికే అతను చనిపోయాడని విషయం అర్థమైంది. జాన్‌ సైక్లింగ్‌ చేస్తూ కిందపడిపోయి ఆనవాళ్లున్నాయి. ఎతైన ప్రాంతం నుండి కిందకి దిగుతుండగా, సైకిల్‌ బ్యాలెన్స్‌ తప్పడం వల్ల కిందపడిపోయిన జాన్‌కు తీవ్ర గాయాలైనట్టు గుర్తించారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక జాన్‌ చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు.

 

పాల్‌ రాబర్ట్‌ లిటిల్‌ జాన్‌కు చెందిన మొబైల్‌తో పాటు అతనికి సంబంధించిన అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి. దీంతో ప్రమాదవశాత్తు జాన్‌ కిందపడి చనిపోయినట్టు  భావిస్తున్నారు. పోస్టుమార్టంకో జాన్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. 
ప్రమాదంలో గాయపడడం వల్ల జాన్‌ చనిపోయినట్టు ప్రథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినా... పోస్టుమార్టం తర్వాత మృతిపై పూర్తి స్పష్టత వస్తుందంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: