క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ఎన్నో వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి. వివిధ వ‌ర్గాలు వీటిపై స్పందిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. అదే రీతిలో ఈ ప్యాకేజీ కేవలం అంకెల గారడీనే అని విపక్షాలు ధ్వజమెత్తాయి. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వ అదనపు ఆదాయం, ఖర్చుల కోసం ప్రకటించిందే తప్ప కరోనా బాధిత రంగాల కోసం కాదన్నారు. రూ. 20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత త‌ప్పుప‌ట్టారు. 

 


మోదీ సర్కారు చెప్తున్నట్లుగా దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ దాదాపు 10 శాతం ఎంతమాత్రం కాదని, 1.6 శాతమేనని కాంగ్రెస్  అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ మండిపడ్డారు. దేశ ప్రజలను మోసపూరిత, అసత్య, జిత్తులమారి ప్రకటనలతో కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ‘కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి, పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా సంస్థల చేతుల్లోకి నగదును అందించేందుకు ప్రధాని మోదీ తప్పక మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే’ అని శర్మ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు. మోదీ ఈ విషయంలో ఊరుకుంటే సరిపోదని, దీనిపై స్పందించాలన్నారు. ఈ క్రమంలోనే ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కూడా ఇది పేద, రైతు, కార్మిక, వ్యాపార వ్యతిరేక ప్యాకేజీ అని దుయ్యబట్టారు. 

 


కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లుగా ఉన్నా.. బడ్జెట్‌పై ప్రభావం మాత్రం రూ.1.50 లక్షల కోట్లేనని బార్క్‌లేస్‌ దేశీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్‌ బజోరియా తెలిపారు. జీడీపీలో ఇది 0.5 శాతమేనని గుర్తుచేశారు. ఈ అంచనా కరోనా సాయం కంటే ద్రవ్యలోటు కట్టడికే మోదీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని ధ్రువపరుస్తుండటం గమనార్హం. మొత్తం ప్యాకేజీలో ఆర్బీఐ గతంలో ప్రకటించిన నిర్ణయాల విలువే రూ.8 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు మొత్తం ప్యాకేజీలో ఖజానాపై పడుతున్న భారం చాలా తక్కువేనని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ సలహాదారు డీకే శ్రీవాత్సవ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: