కరోనా మ‌హమ్మారి నేడో రేపో తొలిగిపోతుందని గత రెండు మూడునెలలుగా ఎదురుచూసి విసిగిపోయిన సమాజాలు అది మరింత విజృంభిస్తుండటంతో.. దానితో సహజీవనం సాగించేందుకే సిద్ధపడుతున్నాయి. అందుకనుగుణంగా వ్యవహారశైలిని, జీవన విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వర్క్‌ ఫ్రం హోంతో తొలుత ఉద్యోగ విధానంలో వచ్చిన మార్పులు.. ఆన్‌లైన్‌ పాఠాలతో విద్యావ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 


కరోనా భూతం ఏ దిక్కు నుంచి వచ్చి కాటేస్తుందో అని అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నిత్యావసర సరుకుల జాబితాలో కరోనా మరికొన్నింటిని చేర్చింది. శానిటైజర్‌, హ్యాండ్‌వాష్‌, మాస్కులు, చేతి తొడుగులు, ఇంటిని పరిశుభ్రంగా ఉంచే ఇతర రసాయనాలు వంటివి తీసుకోవడం తప్పనిసరిగా మారింది. రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణగా హెల్మెట్‌ ధరించాలంటూ పదేపదే చెప్పినా లెక్క చేయనివారిని కరోనా వైరస్‌.. మాస్కులను కచ్చితంగా ధరించేలా చేసింది. ఇక ఎక్కడైనా భౌతికదూరం పాటించాల్సిందే. కూర్చున్నా.. నిలుచున్నా.. ఎక్కడైనా రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీ ఉండాల్సిందే.

 

మ‌రోవైపు  సొంతింటి వంటతో ప్రయోజనాలను గుర్తించిన ప్రజలు ఇక జంక్‌ఫుడ్‌, ఆన్‌లైన్‌ ఫుడ్‌ఆర్డర్లకు దాదాపు స్వస్తి పలికినట్టే. వాటిస్థానంలో చిరు ధాన్యాలు, సేంద్రియ కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోనున్నారు. దీంతోపాటు, వ్యక్తిగత వ్యాయామానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ‌తంలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చేసే కాలక్షేపానికి కాలం చెల్లింది. భౌతికదూరం పాటించడం, గుంపులుగా ఒకేచోట గుమిగూడకుండా ఉండాలనే నిబంధనలతో సాంకేతికత ద్వారానే ఎక్కువగా కనెక్ట్‌ అయ్యే కాలం వచ్చింది. అలయ్‌ బలయ్‌లకు దూరంగా హాయ్‌, బాయ్‌ అని చెప్పుకొంటున్నారు. జీవితంపై ఆశ చివరికి దేవుడిని కూడా దూరం చేసింది. గుంపులుగా ఆలయాలకు వెళ్లి పూజించే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని పూజగదిలోనే మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రజలు.. కరెన్సీ నోట్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. క్రెడిట్‌, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లింపులకూ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయకుండానే బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: