విశాఖలో మరో ఉద్యమం చేపడతానని జనసేనాని పవన్ కళ్యాణ్ అంటున్నారు. విశాఖలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. నిజానికి వారిని తాను ఇక బిడ్డగ ఉంటానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆయన మొత్తం బాధిత కుటుంబానికి పరిహారం కూడా చెల్లించారు.  ఇక అక్కడ శాశ్వతంగా ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

 

మరి ఓ వైపు ప్రభుత్వం ఇలా స్పందిస్తూంటే పవన్ ఇలా మాట్లాడడం ఇపుడు చర్చగా ఉంది. ఇక పవన్ సర్కార్ని  టార్గెట్ చేశారు. స్టైరిన్.. విష వాయువు. దాని సంగతి జనాలకు తెలుసు. కానీ మెత్తగా మాట్లాడుతూ విషం పూసే రాజకీయాల గురించే ఎప్పటికీ ఎవరికీ అర్ధం కానిది. కరోనాతో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అందరి కంటే ముందే చెబితే సెటైర్లు వేశారు. వెటకారాలు ఆడారు.


కరోనాతో ఫైట్ చేయలేక చేతులెత్తేశాడంటూ మండిపడ్డారు. సరే కరోనాతో ఎలా కాపురం చేయాలో ఇపుడు ప్రపంచమంతా చెబుతూంటే నోళ్ళు వెళ్ళబెట్టుకుని వింటున్నారు, అది వేరే విషయం. కానీ జనసేనాని పవన్ స్టైరిన్ తో కూడా  విశాఖ ప్రజలు సహజీవనం చేయమని వైసీపీ నేతలు అంటారని భయపడుతున్నారుట.


విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గుట్టలు గుట్టలుగా స్టైరిన్ ఈ నెల 7 వరకూ ఉంది. ఇపుడు లేదు. దాన్ని టన్నులకు టన్నులుగా వైసీపీ సర్కార్ తరలించేసింది. అది ఓడలెక్కి మరీ దక్షిణ కొరియాకు తరలిపోయింది.  మరి ఇదంతా పచ్చ మీడియా రాయదుగా. దాన్ని అనుసరించేవాళ్ళకు కూడా ఏమీ తెలియదు అనుకోవాలేమో.


విశాఖలో స్టైరిన్ ఇంకా ఉందని పవన్ అనుమానపడుతున్నట్లున్నారు.  అందుకే ఆయన తనదైన ధోరణిలో వెటకారాలు చేస్తున్నారు. ఇంతేనా విశాఖ నిండా జల సంపద ఉందని, దాన్ని వాడుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయిందని కూడా పవన్ అంటున్నారు.


మరి నిజమే  అనుకున్నా  వైసీపీ సర్కార్ వచ్చి ఏడాదే అయింది. ఇన్నాళ్ళూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ఆ జల వనరులను ఎందుకు వాడుకోలేదని నాటి మిత్రుడిగా పవన్ అడిగితే ఈ పాటికి ఉత్తరాంధ్రా జిల్లాలు టోటలుగా  సస్యశ్యామలమైపోవును కదా. ఇక విశాఖలో భూ దోపిడి అని కూడా పవన్ అంటున్నారు.


మరి 2014 నుంచి 2019 వరకూ విశాఖ ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కూడా చూడకుండా పచ్చ నేతలు చేసిన  దోపిడీ పవన్ కి తెలియలేదా అని వైసీపీ నేతలు అంటున్నారు. పైగా దాని మీద సిట్ పేరిట ఒక తూతూ మంత్రం కమిటీని కూడా బాబు ఏర్పాటు చేసి నివేదికను కూడా బయటపెట్టకుండానే గద్దె దిగిపోయారుగా. మరి దాన్ని పవన్ ఎపుడైనా అడిగారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. మొత్తానికి పవన్ ఉనికి రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: