కేంద్రం లాక్ డౌన్ 4 ను అమలు చేస్తోంది. ఇందులో చాలా వరకూ సడలింపులు ఉన్నాయి. కేవలం సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాళ్లు , పాఠశాలలు, మెట్లో వంటి సర్వీసులు తప్ప మిగిలిన చాలా వాటికి కేంద్రం ఓకే చెప్పేసింది. ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. అంటే.. రెండు రాష్ట్రాలు ఒప్పుకుంటే.. ఆ రాష్ట్రాల మధ్య బస్సులు కూడా తిప్పుకోవచ్చన్నమాట.

 

 

ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడుస్తాయని అంతా ఊహించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ బస్సులను తెలంగాణలోకి అప్పుడే అనుమతించబోమని తేల్చి చెప్పేశారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఏపీ సీఎం జగన్ సుముఖంగానే ఉన్నా... తెలంగాణ సీఎం కేసీఆర్ తిరస్కరణ కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడే బస్సులు తిరిగే అవకాశాలు లేకుండాపోయాయి.

 

 

మంగళవారం ఉదయం నుంచే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టబోతుంటే.. ఆంధ్రప్రదేశ్ లోనూ బస్సులు సర్వీసుల కోసం రెడీ అవుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి నడవబోతున్నా.. హైదరాబాద్ లో మాత్రం అప్పుడే తిరిగే అవకాశం లేదు. హైదరాబాద్ లో బస్సులు నడవకపోయినా.. జిల్లాల నుంచి హైదరాబాద్ కు బస్సులు నడుస్తాయి. అయితే అవి శివార్ల వరకూ మాత్రమే నడుస్తాయి.

 

 

ఇక ఏపీలోనూ బస్సులు సర్వీసుల కోసం రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై ఏపీ దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి తొలుత ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అయితే.. ఇవి నాన్ స్టాప్ సర్వీసులుగా నడుస్తాయి. మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ సీఎం ఏపీ బస్సులను రానీయబోమని చెప్పినందువల్ల హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు వెళ్తాయా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: