ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం...మ‌రోవైపు లాక్  డౌన్ స‌డ‌లింపులు కొన‌సాగుతున్న త‌రుణంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి చూపు వ్యాక్సిన్‌ఫై ప‌డింది. మానవజాతిని అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో సఫలీకృతం అవుతున్నారనే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు అందరి చూపు లండన్ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీపై ప‌డింది. ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ వ్యాక్సిన్ త‌యారీకి చేసేయ‌డ‌మే కాకుండా అది వెలువ‌డే తేదీ, వాటి ధ‌ర‌ల ‌విష‌యంలోనూ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

 

కరోనా వ్యాక్సిన్ క‌నుగొన‌డంలో క్రియాశీలంగా పాల్గొన్న‌ అడ్రియాన్‌ హిల్‌ అనే శాస్త్రవేత్త ఈ ఫ‌లితాల గురించి వివ‌రాలు పంచుకున్నారు. అస్ట్రాజెనెకా అనే మందుల కంపెనీతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందిస్తున్న "ChAdOx1 nCoV-19 "అనే కరోనా వ్యాక్సిన్ కోతులపై మంచి ఫలితాలను ఇచ్చిందని వెల్ల‌డించారు.  జూలై, ఆగస్టు నాటికల్లా మనుషులపై ట్రయిల్స్ చేస్తామని అడ్రియాన్‌ హిల్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా వివిధ దేశాల్లోని సుమారు ఏడు ఇనిస్టిట్యూట్‌లలో దీన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాక్సిన్  అతి తక్కువధర ఉంటుందని ఆయన అన్నారు.. అతి తక్కువ ధరకు అత్యధిక మందికి అందజేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ త‌యారీలో భాగంగా భారత్‌లోని పూణే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఉందని అడ్రియాన్‌ హిల్ ప్ర‌క‌టించారు.

 


ఇదిలాఉండ‌గా, కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి కొన్ని ప్రాంతాల్లో ఫార్మాల్డిహైడ్‌, క్లోరిన్‌తోపాటు ఇతర రసాయనాలను చల్లుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)  కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కరోనా వైరస్‌ నిర్మూలన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను చల్లడం వల్ల మంచి కంటే ప్రమాదమే ఎక్కువని హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల కొత్తగా వచ్చే కరోనా వైరస్‌ను అడ్డుకోలేకపోవడమే కాకుండా, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీధులు, మార్కెట్‌ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను పిచికారి చేయడం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను మనుషులపైనా చల్లుతున్నారని, ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని సూచించింది. దీనివల్ల కళ్లకు ప్రమాదం ఉండటంతోపాటు, శ్వాసకోస, చర్మ సంబంధ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: