ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌పై వ్యాప్తిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని 62 దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరగా డబ్ల్యూహెచ్‌ఓ అందుకు అంగీకారం తెలిపింది. 
 
ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా దర్యాప్తు మొదలుపెడాతామని చెప్పారు. మొదటి నుంచి కరోనా వైరస్ పై దర్యాప్తును వ్యతిరేకిస్తున్న చైనా తాజాగా దర్యాప్తుకు అంగీకరించడం కొసమెరుపు. యూరోపియన్ యూనియన్ కరోనా వైరస్‌పై సమగ్ర విచారణ కోసం తీర్మానం చేయగా ఆ తీర్మానానికి చైనా మద్దతు పలికింది. ప్రపంచ ఆరోగ్య సభ 73 వార్షిక సమావేశంలో కరోనా వైరస్ గురించి, డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసిన తీరు గురించి దర్యాప్తు జరపాలని భారత్ తో పాటు పలు దేశాలు డిమాండ్ చేశాయి. 
 
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కరోనా వైరస్ నియంత్రణ కొరకు సుమారు రూ.15,130 కోట్లు అందజేయనున్నట్టు వెల్లడించింది. జిన్ పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెనీవాలో మొదలైన ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొన్నారు. నిష్పాక్షికంగా, వాస్తవికంగా జరగాల్సి ఉందని జిన్ పింగ్ వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో చైనా పూర్తి పారదర్శకంగా ఉంటుందని... శాస్త్రీయంగా, వృత్తి నిపుణతతో సమగ్ర సమీక్షను నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
డబ్ల్యూహెచ్‌వోకు, ఇతర దేశాలకు వైరస్‌ జన్యుక్రమంతో పాటు ఇతర వివరాలను పూర్తిగా తెలియజేశామని చెప్పారు. మొదటి నుంచి కరోనా వైరస్ విషయంలో చైనాపై ఆరోపణలు చేస్తున్న అమెరికా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్ర దర్యాప్తులో వైరస్ గురించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయేమో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: