దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొదట్లో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదు కాగా ప్రస్తుతం 5000కు అటూఇటుగా నమోదవుతున్నాయి. కరోనా విజృంభిస్తూ ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పైనే ఆధారపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసి కోతులపై ప్రయోగించగా ఆ వ్యాక్సిన్ న్యూమోనియాను అడ్డుకుంటుందని తేలింది. వ్యాక్సిన్ కరోనాపై పాక్షికంగా మాత్రమే ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోతుల్లో కరోనాను అడ్డుకోవడంలో వ్యాక్సిన్ సక్సెస్ కాలేదు. కోతుల్లో సక్సెస్ కాలేకపోయిన వ్యాక్సిన్ మనుషులపై సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. 
 
మనుషుల్లోనూ ఇదే తరహా ఫలితం వస్తే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ అస్ట్రజెనెకా మధ్య బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధన కోసం 47 మిలియన్ పౌండ్లు వెచ్చిస్తుండగా వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే 30 మిలియన్ల డోసులను అస్ట్రజెనెకా ఉత్పత్తి చేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 
 
వ్యాక్సిన్ ఇచ్చిన కోతులు, వ్యాక్సిన్ ఇవ్వని కోతుల మధ్య ఆర్ఎన్‌ఏలో ఎలాంటి తేడా లేదని చెప్పారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌‌లో ప్రొఫెసర్‌గా పని చేసిన డాక్టర్ విలియం మీడియాకు ఈ విషయాలను తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుంది. మరోవైపు కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: