దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్న త‌రుణంలోనే కేంద్రం లాక్ డౌన్ 4.0 గైడ్ లైన్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నిబంద‌నలు అమ‌లైతే క‌రోనా క‌ట్ట‌డి జ‌రిగే ప‌ని కాద‌నే భావ‌న ప‌లువురిలో క‌లిగింది. అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిన్న విలేక‌రుల స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించారు. క‌రోనాతో స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని పేర్కొంటూ అన్ని కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇచ్చేశారు. దీంతో హైద‌రాబాద్‌లో సీన్ పూర్తిగా మారిపోయింది. 55 రోజుల లాక్‌ డౌన్‌ అనంతరం హైదరాబాదీలు.. ఇవాళ రోడ్లపైకి వచ్చారు. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ విధులకు వెళ్తున్నారు. దీంతో స‌హ‌జంగానే రోడ్ల‌న్నీ బిజీ అయిపోయాయి.

 

కంటైన్‌మెంట్‌ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించుకోవ‌చ్చున‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యం ఓవైపు రాజధానిలో ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతి లేకపోవడంతో.. తమ పని ప్రాంతాలకు వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు ఉద్యోగులు, కార్మికులు. కొందరైతే తమ స్నేహితుల వాహనాల్లో వెళ్తున్నారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. వాణిజ్య పరమైన ఏరియాల్లో దుకాణాల యజమానులు, ఉద్యోగులతో సందడి నెలకొంది. ఉదయం 9 గంటలకే తమ విధుల్లో చేరిపోయారు. దుకాణాలకు సరి - బేసి విధానంలో అనుమతివ్వడంతో.. తమ దుకాణాలను శుభ్రం చేసుకునే పనిలో యజమానులు బిజీ అయిపోయారు. 

 

కాగా, క‌రోనాపై అవ‌గాహ‌న క‌లిగి ఉన్న ప్ర‌తి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారు. అయితే, ఇలా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌ని వారి సంగ‌తి ఏంట‌నే ప్ర‌శ్న తెర‌మీద‌కు వ‌స్తోంది. ప్ర‌జ‌లు ‌త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోక రోడ్డెక్కితే, ఆయా కార్య‌క‌లాపాల్లో పాల్గొంటే వారి వ‌ల్ల వైర‌స్ సంక్ర‌మ‌ణ పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురిలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: