ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు కరోనా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కరోనా రానివారు ఎవ్వరూ ఉండరేమోనని అన్నారు. కరోనా, లాక్ డౌన్, సంక్షేమ పథకాల అమలు గురించి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే 3 రోజుల్లో ప్రజారవాణా ప్రారంభమవుతుందని జగన్ అధికారులకు తెలిపారు. 
 
అందరూ స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకుంటే మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. ఇకపై అనుసరించాల్సిన పద్ధతి వేరుగా ఉంటుందని కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం సూచించారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాలని, చిన్న దుకాణాల నుంచి ప్రతిషాపు ఓపెన్ చేయాలని అధికారులకు చెప్పారు. అధికారులు కరోనా కట్టడి కోసం అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు. 
 
కరోనా వైరస్‌ను జ్వరంతో పోలుస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. కరోనా కూడా జ్వరం మాదిరిగానే వస్తుందని పోతుందని అన్నారు. కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని అన్నారు. కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదబోదని వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాల్సి వస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు. 
 
ప్రజల్లో పూర్తిగా భయాందోళనలను తొలగించాలని జగన్ చెప్పారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని అన్నారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు మినహా మిగతా వాటిని ప్రారంభించాలని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే అని వ్యాఖ్యలు చేశారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: