ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదం ప్రధానంగా నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు పై ఎప్పుడైతే జీవో విడుదల చేశారో అప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ పై గ‌రం గ‌రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాద‌మే హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద ఫిర్యాదులు కూడా వెళ్లడంతో అటు తెలంగాణ ఇటు ఏపీ ప్ర‌భుత్వాలు రెండు వాదోప వాద‌న‌ల‌కు దిగుతున్నాయి. 

 

ఎత్తిపోతల పథకం పై ఏపీ సర్కార్ ఇప్పటికే తన వాదనను వినిపించింది. ఎత్తిపోతల పథకం కారణంగా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు. అని చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టులో దిగువస్థాయి నీటిని తీసుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు ఉండడంతో... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీరు అంద‌డం క‌ష్టంగా ఉన్న‌ నేపథ్యంలో కొత్త లిఫ్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తాము త‌మ కోటా మేర‌కే నీళ్లు వాడుకుంటున్నామ‌న్న ఏపీ స‌ర్కార్ ఇందుకు లెక్క‌లు కూడా చూపించింది.

 

తెలంగాణ‌లో కొత్త ప్రాజెక్టులు అయిన కల్వకుర్తి.. నెట్టెంపాడు.. ఎస్ఎల్ బీసీ వంటి ప్రాజెక్టుల వ‌ల్ల  నీటి వినియోగం 77 టీఎంసీల నుంచి 105 టీఎంసీలకు.. ఆయుకట్టు 7.20లక్షల ఎకరాల నుంచి 9.93 లక్షల ఎకరాలకు పెరిగిన విష‌యం చెప్పారు. అందువ‌ల్లే ఏపీలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేట‌ర్‌కు నీళ్లు అంద‌డం లేద‌ని కూడా ఏపీ ప్ర‌భుత్వం పేర్కొంది. ఏదేమైనా కేసీఆర్ ఏ విష‌యంలో అయినా ఎన్ని లెక్క‌లు లాజిక్కుల‌తో విప‌క్ష‌లు.. ఇత‌రుల‌ను ఇబ్బంది పెడ‌తారో ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం అంతే లాజిక్ గా కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపులు తిరిగి ఎలా ముగుస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: