ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల జల జగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ చక్కటి స్నేహితుల్లా మెలిగిన వారు.. ఇప్పుుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో వచ్చిన విబేధంతో చిటపటలాడుతున్నారు. ఈ ముఖ్యమంత్రుల కయ్యం కొందరికి మాత్రం మహా పసందుగా కనిపిస్తోంది. అలాంటి వారిలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ముందువరుసలో కనిపిస్తున్నారు.

 

 

చూశారా అప్పుడే కేసీఆర్,జగన్ దోస్తీ అటకెక్కింది అంటూ ఆయన తన కొత్త పలుకులో తన సంతోషం ప్రకటించేశారు. ఆయన కేసీఆర్, జగన్ విబేధాల గురించి ఏమంటున్నారంటే.. " స్నేహం అంటే ఇదేరా’’ అని అధికార వైసీపీ నాయకులు భుజాలు చరుచుకున్నారు. ఏడాది గడవకముందే ఈ మురిపాలు, ముచ్చట్ల స్థానంలో చిటపటలు మొదలయ్యాయి. ఉమ్మడి ప్రాజెక్ట్‌ ఊసు గాలికిపోయింది. జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జీవో జారీ చేయడమే ఇందుకు కారణం. పోతిరెడ్డిపాడు వ్యవహారం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ వివాదానికి దారితీసింది.. అంటూ రాసుకొచ్చారు.

 

 

అయితే.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీవోలో పేర్కొన్నట్టుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణలో కేసీఆర్‌తో ఆడుకోవచ్చుననీ, ఆయనను దెబ్బతీయడానికి మంచి అవకాశం దొరికినట్టేననీ తెలంగాణలో ప్రతిపక్షాలు ఆశపడుతున్నాయట. నిజానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదట. అలాగే రాయలసీమకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం కూడా ఉండదట. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం సాధ్యం అవుతున్నదని రాధాకృష్ణ అంటున్నారు.

 

అంతేకాదు.. జగన్ పిచ్చిగానీ.. అసలు ఎన్ని నీళ్లు తరలించినా నిల్వ చేసుకోగల సామర్థ్యం ఇప్పుడు రాయలసీమలో నిర్మితమైన జలాశయాలకు లేదని గుర్తు చేస్తున్నారు. ఎన్నినీళ్లు తెచ్చుకున్నా.. ప్రస్తుతం 37 టీఎంసీలకు మించి నింపుకోలేని పరిస్థితి ఉందని.. జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోకుండా పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం ఏమిటని ఆర్కే వాదిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్, జగన్ మధ్య గొడవ ఆర్కేకు కర్ణపేయంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: