ఈ దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా మహాత్ముడిని కొలుస్తుంది. ఆరాధిస్తుంది. ఆయన విధానాలు నూటికి నూరు శాతం నచ్చకపోయిన వారు సైతం ఆయన అంటే పూజనీయుడు అంటారు. అటువంటి మహాత్ముడుని ఇప్ప‌టికి 72 ఏళ్ళ క్రితం నాధూరాం గాడ్సె దారుణంగా హత్య చేశాడు. ఆ ఘటనకు  నాడూ నేడూ కూడా దేశం తల్లడిల్లిపోవాల్సిందే.

 


అసలు ఈ దేశం గురించి తెలిస్తే ఎవరూ మహాత్ముడి హత్యను సమర్దించరు. పైగా గాంధీ ప్రవచించింది అహింసావాదాన్ని, అభిప్రాయంతో భేదం ఉంటే ఉండొచ్చు. అది తప్పులేదు కానీ దానికి చావు అన్నదే పరిష్కారం అని తుపాకీ పడితే ఇప్పటిదాకా భారత్ దేశం ఇలా  ఎదిగేదా. ఈనాడు  విలాసంగా కూర్చుని కబుర్లు చెబుతూ గాంధీ హత్యను సమర్ధిస్తున్న వారు కూడా ఇంత ధీమాగా ఈ దేశంలో బతికేవారా.

 

హింసామార్గం భారత్ ఎపుడూ సమర్ధించలేదు. భారతదేశం గొప్పదనమే అది. అభిపాయాలు ఒకరివి తప్పు కావచ్చు, కానీ మనిషినే లేకుండా చేయడం అన్నది దారుణం. ఈ గడ్డ మీద పుట్టి గాజు అద్దాల్లో బతుకుతూ ఈ దేశానికి హింసావాదం కరెక్ట్ అని భావిస్తున్నవారు ఎవరైనా ఉంటే వారు ఆ నిప్పు ఏదోనాటికి తమ కొంపకు అంటుకుంటుంది అని గ్రహించడం మంచిది. చరిత్రను తవ్వాలనుకోవడం తప్పు కాదు.

 

కానీ అది చరిత్ర. వర్తమానానికి దానికి పోలిక ఉండదు, ఈ రోజుకు ఇలా కూర్చుని గత చరిత్ర తప్పులు వెతకాలనుకోవడం దుస్సాహసమే  అవుతుంది. ఈ దేశానికి ఒక గాంధీ అన్న వ్యక్తి  లేకపోయినా స్వాతంత్ర్యం వస్తుందేమో. సాయుధ పోరాటాన్నే నమ్ముకుని కూడా దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విడిపించవచ్చు.

 

కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. కత్తిని పట్టిన వాడు, దాన్ని నమ్ముకున్న వాడు ఎపుడో ఒకపుడు ఆ కత్తికే బలి అయిపోతాడు. అది వ్యక్తి అయినా దేశం అయినా అంతే. అలా సాయుధ  బలంతో  స్వాతంత్ర్యం సాధించినా కూడా అది  ఈ దేశానికి ఇప్పటిదాకా నిలిచేది కాదు అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకంటే బలవంతుడు మనలను కొట్టడానికి ఎప్పటికీ సిధ్ధంగా ఉంటాడు.

 

ఇక విద్వేషంతో వేరు పడి ఒక దేశంగా ఇప్పటికీ మారని పాకిస్థాన్ కధను కళ్లారా చూస్తున్నదే  మరో వైపు ఏళ్ల తరబడి సాయుధ పోరాటాలు చేసినా కూడా ఏమీ సాధించలేని భావజాలాన్ని చూస్తున్నాం. అందువల్ల అందరికీ శ్రీరామ రక్ష అహింసావాదమేనని గాంధీ ఎన్నో ఏళ్ళ క్రితం చెప్పినది ఇప్పటికీ ఎప్పటికీ సర్వజనామోదమైంది. అటువంటి మహాత్ముడిని ఆయన పుట్టిన సొంత గడ్డ మీదనే అవమానించడం ఒక ఫ్యాషన్ కావచ్చు. 

 

తలలో గుజ్జు ఉందని తప్పుడు భావాలతో భ్రమించే  వారికి అది మానసిక ఆనందంగా  ఉండవచ్చు. కానీ ఆయుధాన్ని వదిలేసి గాంధీ మార్గంలో ఈ డెబ్బయి ఏళ్ళలో నడచిన దేశాలను, గాంధీ ప్రభావంతో స్పూర్తి పొందిన ప్రపంచ నేతలను ఒక్కసారి చూస్తే మాత్రం ఎవరూ  గాంధీ హత్యనుకలలో కూడా  సమర్ధించరు. అలా సమర్ధించేవారు కచ్చితంగామూర్ఖులే అవుతారు.

 

కాలాలు మారినా మారనిది గాంధీ యిజం. అదేదో అరువు తెచ్చుకున్న పిచ్చి యిజాల లాంటిది కానేకాదు. భారతీయత‌తో సమ్మిళితమైన నిర్మళమైన ఈ దేశం తత్వమది. ఒక విధంగా చెప్పాలంటే సర్వ మానవాళికి అదే జీవన వేదం. జీవన విధానం కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: