అదేంటో ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు రోజురోజుకూ  పెరుగుతున్నాయి అనిపిస్తున్నాయి.ఇద్దరూ రెండుగా చీలిన ఉమ్మడి ఏపీని చెరో వైపునా ఇద్దరూ నిలిచి పాలిస్తున్నారు. మొదట్లో ఇద్దరి సాన్నిహిత్యం చూసిన వారు ఈ ఇద్దరూ కలసి ఉమ్మడి ఏపీ నాటి కళ తెప్పిస్తారని భావించారు. అయితే కాలం గడచే కొద్దీ   సీన్ మారుతోంది.

 

దాంతో పాటే పొలిటికల్ సీన్ కూడా మారుతోంది. ఏపీలో జగన్ మోడీకి జై అనేలా ఉన్నారు. మోడీ కూడా జగన్ చెప్పినవి మనసులో ఉంచుకుని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా జగన్ చెప్పిన విషయాలను మోడీ జాగ్రత్తగా వింటూ వచ్చారు. బతుకూ ముఖ్యమే, బతుకు బండీ ముఖ్యమే అని మోడీ అన్న మాటను జగన్ అంతకు ముందే చెప్పారు.

 

ఇక లాక్ డౌన్ని దశలవారీగా సడలించాలన్న ఆలోచన కూడా ఏపీ సీఎం మొదట కేంద్రం ద్రుష్టికి తెచ్చారు. అలాగే రాష్ట్రాలను ఆదుకోవాలని కూడా కోరారు. మొత్తానికి మోడీ ఒక ఆర్ధిక ప్యాకేజి ప్రకటించారు. 20 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజి అది. దాంతో దేశమంతా ఆస‌క్తిగా చూసింది. అయితే అది దీర్ఘ కాలిక ప్రయోజనాలకు సంబంధించినది. అలాగే దేశంలో కొన్ని రంగాలకు ఊతమిచ్చేలా ఉంది.

 

నేరుగా పేదవాడి జేబుని నింపేది కాదు. అలాగే రాష్ట్రాల చేతికి డైరెక్ట్ గా డబ్బు ఇచ్చినదీ లేదు. దాంతోనే కేసీయార్ మండిపడుతున్నారు. నిజానికి కేసీయార్ హెలికాప్టర్ మనీ అడిగారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. ఇపుడు రుణ పరిమితిని పెంచామని చెబుతూ కూడా షరతులు పెట్టిందని మండిపడుతున్నారు. దాంతోనే ప్యాకేజి వట్టి దండుగమారిదని కూడా అనేశారు. 

 

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మాత్రం కేంద్రం ప్రకటించిన ప్యాకేజిని స్వాగించారు. ప్రభుత్వం దీని మీద ఒక కమిటీని వేసి ఏ ఏ రంగాలకు ఈ ప్యాకేజి వల్ల మేలు జరుగుతుందో చూడమని కూడా జగన్ కోరారు. ఆ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తో పాటు, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు, ముఖ్యనాయకులు ఉన్నారు.

 

అంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజి ఏపీకి, జగన్ కి నచ్చిందనుకోవాలి. కానీ కేసీయార్ మాత్రం మోడీని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రాలను కేంద్రం అవమానించిందని అంటున్నారు. కేంద్రం ఈ తరహా ప్యాకేజి ప్రకటించి తన పరువు తానే తీసుకుందని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు మిత్రులూ మోడీ ప్యాకేజి విషయంలో తలో విధంగా స్పందించడం మాత్రం చర్చగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: