గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి వైసీపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవలే టీడీపీ నేత దేవినేని ఉమా, మంత్రి కొడాలి నాని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అటు గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డారని, ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఆలపాటి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు.

 

ఇక తాజాగా గురజాల నియోజకవర్గంలో చాలా మాఫీయాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి గురజాల నియోజకవర్గాన్ని మాఫీయా రాజ్యంగా మార్చారని మండిపడుతున్నారు. అలాగే గురజాలలోనే బ్లీచింగ్ స్కామ్ మొదలైందని అంటున్నారు. బ్లీచింగ్‌లో సున్నం కలిపి కోట్లు నోక్కేశారని ఆరోపిస్తున్నారు.

 

ఇక ఎమ్మెల్యే సొంత మనషులే మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని, దాచేపల్లిలో మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తి కాసు వ్యక్తిగత ఫోటో గ్రాఫర్ అని చెబుతున్నారు. మైనారిటీ బాలికలపై కాసు అనుచరులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. నాటు సారా, గుట్కా, రేషన్ మాఫీయాలతో నియోజకవర్గం భ్రష్టు పట్టిందని, పేకాట క్లబ్బులు, వ్యభిచార గృహాలను కూడా నడుపుతున్నారన్నారు.

 

అసలు రాష్ట్రంలో ఎక్కడా లేని స్కాములు గురజాలలోనే జరుగుతున్నాయని యరపతినేని చెబుతున్నారు. అయితే యరపతినేనికి గురజాల వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లలో యరపతినేని అరాచకాలు భరించలేకే కదా ప్రజలు కాసుని గెలిపించారని అంటున్నారు. ఇక ఇసుక మాఫీయా, భూ మాఫీయా, మైనింగ్ మాఫీయా ఇలా అన్ని మాఫీయాలు చేసింది యరపతినేని అని, అందుకే ఆయన మీద పలు కేసులు కూడా ఉన్నాయని, ఆఖరికి సీబీఐ విచారణ కూడా జరుగుతుందని, త్వరలోనే ఆయన అక్రమాలకు తగిన ప్రతిఫలం దక్కుతుందని కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: