తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ విష‌యంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చన సంగ‌తి తెలిసిందే. కరోన వైరస్ కారణంగా టెన్త్ పరీక్షలు నిలిపి వెయ్యాలంటూ దాఖలైన పిల్ పై హైకోర్ట్ మంగ‌ళ‌వారం అత్యవసర విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా లాక్ డౌన్ అనంతరం అంటే జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించుకోవాలని కోర్ట్ ఆదేశించింది. దీంతో జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర‌ విద్యా శాఖ భావిస్తోంది. ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది.  

 


కాగా, హై కోర్టు నిబంధనల ప్రకారం 10 వతరగతి పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవ‌ల జ‌రిగి తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ . భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్‌ చేస్తూ..  అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఒక హాల్లో 10 నుండి 15 మంది విద్యార్థులతో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు . వారి కోసం ప్ర‌త్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 

 

 

మ‌రోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ తదితర కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నది. పదోత రగతి పరీక్షలు జూన్‌లో, దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పరీక్షలు జూలైలో జరుగనున్నాయి. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షల కంటే తక్కువ మంది రాసే సెట్లను నిర్వహించటం తేలిక. అందునా వీటిలో ఎక్కువగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులే ఉన్నాయి. దాంతో యూనివర్సిటీల అధికారులతో చర్చించి, ప్రభుత్వ అనుమతితో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే జూలైలోనే డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: