గత కొన్ని సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల కంటే ప్రచారం పైనే దృష్టి పెడుతున్నారు. ఐతే చంద్రబాబు నాయుడు చాలా సంవత్సరాల తరువాత నిజమైన ప్రజా సమస్య కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సమస్య లేకపోయినా సమస్య సృష్టించిన సందర్భాలు కోకొల్లలు. కానీ ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యపై చంద్రబాబు స్పందించారు. 
 
భారీ మొత్తంలో కరెంట్ బిల్లులు రావడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమం చేయాలని నేతలకు, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రెండు నెలల బిల్లు ఒకేసారి రావడం, విద్యుత్ వినియోగం పెరగడం, వేసవి కాలం కావడం, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, కరెంట్ బిల్లుల కేటగిరీలు మారడం ఇతర కారణాల వల్ల భారీ మొత్తంలో కరెంట్ బిల్లులు వచ్చాయి. ప్రజలు కరెంట్ బిల్లును చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
అధికారులు ఇచ్చిన నివేదికలపై ప్రభుత్వం ఆధారపడుతోందే తప్ప అసలు వాస్తవాలు తెలుసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కరెంట్ బిల్లుల వల్ల దోపిడీకి గురయ్యామని ప్రజల్లో బాధ వ్యక్తమవుతోంది. కరెంట్ బిల్లులు చూస్తేనే షాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కరెంట్ బిల్లుల విషయంలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇదే తరుణంలో చంద్రబాబు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా బిల్లులపై గురువారం నుంచి నిరసన దీక్షల ద్వారా పోరాటానికి దిగుతున్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రతిపక్షాలపై నిందలు మోపకుండా తప్పును సరి చేసుకోవాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే విద్యుత్ నిరసన దీక్షల గురించి నేతలకు సూచనలు చేశారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: