కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చాలా వీక్ గా ఉంది. ఏపీ సంగత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్టీ తుడిచి పెట్టుకు పోయినట్టయింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. పోనీ.. తెలంగాణ ఇచ్చారు కాబట్టి అక్కడైనా ఏమైనా బావుందా అంటే కేసీఆర్ పుణ్యమా అని అదీ లేదు.

 

 

కాకపోతే ఏపీతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ అనే చెప్పాలి. దీనికి తోడు.. తెలంగాణలో కేసీఆర్ పై ప్రజలకు మొహం మొత్తితే ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే. కానీ ఏపీలో అలా కాదు.. అక్కడ ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. అందుకే ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పై కాంగ్రెస్ అధిష్టానానికి ఆశలు ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా తెలంగాణ పీసీపీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని విజయంవైపు నడిపించడంలో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికవైపు కాంగ్రెస్ హైకమాండ్ కొన్నాళ్లుగా దృష్టిసారించింది.

 

 

తాజాగా ఈ పోస్టుకు భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైకమాండ్ దాదాపు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. డిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారట. ఆమె కూడా కోమటిరెడ్డిని పీసీసీ అధ్యక్షుడుగా నియమించేందుకు ఓకే చెప్పేశారట. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

 

 

తెలంగాణలో కాంగ్రెస్ జోరు తగ్గినా నాయకత్వానికి పోటీ మాత్రం బాగానే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి పగ్గాల కోసం మల్కాజిగిరి ఎమ్.పి రేవంత్ రెడ్డితో పాటు పలువురు పోటీ పడుతున్నారు. ఈ రేసులో ఉన్నవారిలో మల్లుభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జానారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు ఉన్నారు. అయితే ఫైర్ బ్రాండ్ లాంటి కోమటిరెడ్డి వైపే సోనియా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: