తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మాత్రం త‌గ్గ‌డం లేదు. అందులోనూ జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎక్కువ‌గా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయినా ఇక్క‌డి జ‌నాలు మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పెద్ద‌గా లెక్క‌చేయ‌డం లేదు. సామాజిక దూరం దేవుడెరుగు..! ఇక్క‌డ‌ రోజూ పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు మాత్రం మాస్కు ధరించట్లేదు. ఈనెల 7 నుంచి మాస్కు ధరించకపోతే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51 (బీ) కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా మాస్కులు ధరించని వారి ముఖాలను గుర్తించే ఆర్టిఫిషియల్‌ ఇం టెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు అమల్లోకి తెచ్చారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 నాటికి మాస్కు ధరించని వారి సంఖ్య 4,719కి చేరగా, 19వ తేదీ నాటికి 16,264కి చేరింది. ఈ ఉల్లంఘనలు నగర కమిషనరేట్లలోనే అధికంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో మరీ అధికంగా ఉన్నాయి.

 

కేవలం 13 రోజుల్లోనే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 3,892 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌ (844), రాచకొండ (1,105) కూడా కలిపితే మొత్తం 5,841 కేసులయ్యాయి. వరంగల్‌ (1,846), రామగుండం (1,461), ఖమ్మం (867) తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మంగళవారం ఒక్కరోజే నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 38కి చేరింది. ఇక రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో 42 కేసులు నమోద‌య్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీకి చెందిన వారు 34 మంది ఉండగా, వలసదారులు 8 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1634కి చేరింది. తాజాగా కరోనా నుంచి 9 మంది కోలుకోగా, ఇప్పటివరకు 1011 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 585 మంది చికిత్స పొందుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: