కరోనా రాకతో మీడియా రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రత్యేకించి ప్రింట్ మీడియా అతలాకుతలమవుతోంది. ఆదాయం లేక ఓవైపు, న్యూస్ ప్రింట్ ఖర్చుతో మరోవైపు ఇబ్బందిపడుతోంది. ఇంతా చేసి పత్రికను మార్కెట్లోకి తెచ్చినా కరోనా భయంతో అమ్మకాలు అంతంత మాత్రమే. అందుకే కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి పత్రికలు జిల్లా ఎడిషన్లను ఆపేశాయి. మెయిన్ పేజీలోనే ఒకటో, రెండో పేజీలు కేటాయిస్తూ సరిపెట్టాయి.

 

 

అగ్ర దిన పత్రిక ఈనాడు సహా దాదాపు అన్ని ప్రధాన పత్రికలూ ఇదే మార్గం అనుసరించాయి. ఆ తర్వాత ఒకటి, రెండు వారాలు సండే మేగజైన్ ను కూడా ఆపేసినా ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించాయి. ఇక ఇప్పుడు.. కరోనా ప్రభావం కాస్త తగ్గడం.. అన్ని నిబంధనలు ఎత్తేయడంతో పత్రికలు కూడా పునరాలోచనలో పడ్డాయి. దినపత్రికలకు జిల్లా ఎడిషన్లు ప్రాణప్రదం. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా వాటిని మళ్లీ తీసుకురావాలని నమస్తే తెలంగాణ మొదట నిర్ణయించింది.

 

 

ఆ తర్వాత సాక్షి దిన పత్రిక కూడా జిల్లా ఎడిషన్లు తీసుకురావాలని డిసైడైంది. ప్రస్తుతం ఈ రెండు పత్రికలు జిల్లా టాబ్లాయిడ్లను కూడా అందిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. తెలుగు దిన పత్రికల్లో ఎలాంటి మార్పులకైనా శ్రీకారం చుట్టే ఈనాడు మాత్రం ఈ జిల్లా ఎడిషన్ల రేసులో వెనుకబడిందనే చెప్పాలి. ఆ పత్రిక ఇంకా మెయిన్ పేజీలోనే ఓ రెండు పేజీలు కేటాయించి సరిపెడుతోంది.

 

 

మరి తెలంగాణలో నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాయి. జిల్లా టాబ్లాయిడ్లను పోటాపోటీగా ప్రారంభించాయి..? తెలంగాణలో ప్రింట్ మీడియా ఎందుకు జోరందుకుంటోంది.? ఈ ప్రశ్నలకు సమాధానం మార్కెట్ పై పట్టు సాధించడం కోసమే. ఈనాడు వంటి పత్రికను దెబ్బ కొట్టడం.. అందివచ్చిన అవకాశాన్ని ఖర్చుకు వెనుకాడకుండా అంది పుచ్చుకోవాలనుకోవడమే. మరి ఇప్పుడు ఈనాడు ఏం చేస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: