టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి. తెలుగు ప్రజల ధైర్య సాహసాలకు ప్రతీక ప్రకాశం పంతులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడ్డాక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లా వినోదిరాయునిపాలెం గ్రామంలో 1872 ఆగస్టు 23న పేద కుటుంబంలో జన్మించారు. 
 
ప్రకాశం పంతులు తన తాతగారి ఊరైన వల్లూరులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి నాటకాలను ఎంతో ఇష్టపడే ప్రకాశం పంతులు ఎంతో కష్టపడి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. ఉపాధ్యాయుడు హనుమంతరావు నాయుడు సహకారంతో ప్రకాశం పంతులు ప్రీ మెట్రిక్ చదివారు. అనంతరం రాజమండ్రిలో ఎఫ్‌ఐ చదివి మదరాసుకు వెళ్లి న్యాయ శాస్త్ర పట్టభద్రుడయ్యారు. బారిస్టర్‌ చదవాలన్న ఉద్దేశంతో 1907లో లండన్‌కు వెళ్లి కోర్సు పూర్తి చేసి భారత్ కు తిరిగి వచ్చారు. 
 
తర్వాత మదరాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించి మదరాసులోని ప్రముఖ లాయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయోద్యమంలో పాల్గొనడానికి ఆదాయం ఉన్న న్యాయవాద వృత్తిని వదిలేసి రాజ్య పత్రికకు సంపాదకత్వం వహించారు. అనంతరం భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి గాంధీ ప్రభావంతో ప్రకాశం పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌కు అంకితమయ్యారు. 1921లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై స్వాతంత్రోద్యమం కోసం స్థాపించిన స్వరాజ్యం పత్రిక కోసం ఆస్తిని ఖర్చు పెట్టారు. 
 
1922లో సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో వేల మందితో ప్రకాశం పంతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లారు. ప్రకాశం పంతులు 1946 ఏప్రిల్‌ 30న ప్రకాశం మదరాసు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1953 అక్టోబర్‌ 1న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు నియమితులయ్యారు. ప్రజల కోసమే నిరంతరం శ్రమించి ఆంధ్ర కేసరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేరిన ప్రకాశం పంతులు 1957, మే 20న పరమపదించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: