కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో భాగంగా భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం జగన్ సర్కార్ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి సచివాలయంతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు తప్పనిసరిగా ఉద్యోగాలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న వారు, గర్భవతులు, పెద్ద వయసు వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం ఇంటి నుంచి పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 
 
ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో మొదట థర్మల్ స్క్రీనింగ్ చేసి... చేతులు శానిటైజ్ చేసుకున్న అనంతరం కార్యాలయంలోకి అనుమతిస్తారు. విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో ఒక ఉద్యోగికి మరొక ఉద్యోగికి మధ్య ఆరడుగుల భౌతిక దూరం ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని.... పొగాకు, గుట్కా, పాన్ వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. 
 
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ–ఆఫీస్‌ ద్వారానే ఫైళ్లను ప్రాసెస్ చేయాలని... అధికారిక ఈ–మెయిల్స్‌ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని.... టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వారిని హోం క్వారంటైన్ లో ఉంచాలని పేర్కొంది. 
 
కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలని... కరోనా నియంత్రణ కోసం కృషి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు ఈ ఆదేశాల అమలు జరిగేలా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: