మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారితో రోజూ దిన దిన గండంగా గడుస్తుంది.. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కాలం కాని కాలంలో అంఫాన్‌ తుఫాన్ మొదలైంది.  పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్‌ తుపాను తీవ్రత కొనసాగుతోంది. అంఫాన్‌ తుఫాన్‌ తీరంవైపు పరుగులు పెడుతోంది.  దీని తీవ్రతకు సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రెండో అతిపెద్ద సూపర్ సైక్లోన్‌గా మారనుండటంతో పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా, ఆ తర్వాత మహాతుఫాన్‌గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెనుతుఫాన్‌ పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా-బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌ తీరంపై అంఫాన్‌ ప్రభావం బలంగా కనిపిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ తీరం అల్ల కల్లోలంగా మారింది. తుపాను ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సోంపేటలోని బారువ తీరంతో సముద్రం 300 అడుగుల ముందుకు వచ్చింది.   తుపాను తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  ఇక అంఫాన్  కారణంగా ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు బుధవారం నుంచి రావాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: