కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్ కు రప్పిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు ప్రత్యేక విమానాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఒక విమానం విశాఖ చేరుకుంది. నిన్న రాత్రి 320 మంది ప్రయాణికులతో అతిపెద్ద విమానం వైజాగ్ కు చేరుకుంది. 
 
సౌదీ నుంచి విజయవాడకు నేడు మరో విమానం రానుంది. జెడ్డా నుంచి విజయవాడకు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఎయిరిండియా 1914 విమానం చేరనుంది. తెలంగాణకు చెందిన ప్రయాణికులు కూడా ఇదే విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు. వారిని మరో విమానంలో హైదరాబాద్ కు పంపనున్నారని తెలుస్తోంది. తొలి విడతలో పిల్లలు, వృద్దులు, మహిళలు, అనారోగ్యం బాగా లేని వారికి, ఇతర రాష్ట్రాల వారికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. 
 
రెండో విడతలో మాత్రం కేంద్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. వందే భారత్ మిషన్ లో భాగంగా మూడు ప్రత్యేక విమానాలు రాష్ట్రానికి రానున్నాయి. ఎయిరిండియాకు చెందిన విమానం ఈరోజు రాత్రి విజయవాడకు చేరుకోనుండగా 23న ఎయిరిండియాకు చెందిన మరో విమానం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రానుంది. 
 
ఈ నెల 27న మరో విమానం గన్నవరం చేరుకోనుందని తెలుస్తోంది. దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం అధికారులు అంతర్జాతీయ టెర్మినల్‌ను సిద్ధం చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారికి థర్మల్ స్క్రీనింగ్ తో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అధికారులు విమానశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా ప్రయాణికుల ఎంపిక మేరకు ప్రభుత్వ లేదా పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: