కేంద్ర అధికార పార్టీగా బిజెపికి ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదు. రెండోసారి కూడా తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ఒక్కో రాష్ట్రంలో తమ సత్తా చూపిస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తోంది. ఎప్పటి నుంచో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్నా, దానికోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా, బీజేపీ ఆశ మాత్రం తీరడం లేదు. అయినా తమ ప్రయత్నాలను ఆపకుండా చేస్తూనే వస్తోంది. తెలంగాణలో పరిస్థితి కాస్త ఫర్వాలేదు అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం సొంత పార్టీ నాయకుల గ్రూపు రాజకీయాలు కారణంగా బిజెపి లాభ పడలేకపోతుంది. ఇప్పటికే ఏపీలో మూడు గ్రూపులుగా విడిపోయిన బిజెపి ఎవరికి వారు పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒక వర్గం నాయకులు జగన్ కు మద్దతుగా మాట్లాడుతుండగా, మరో వర్గం నాయకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 

 

IHG


ఇక మూడో వర్గం కేంద్ర బిజెపి ఆదేశానుసారం వ్యవహరిస్తూ పార్టీ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే విషయంలో విఫలమవుతున్నారు. కేంద్ర బిజెపి పెద్దలు ఒక రకంగా వ్యహరిస్తుంటే  ఏపీ బీజేపీ నాయకులు ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, అసలు బిజెపి విధానం ఏంటి అనేది ఎవరికి అంతుచిక్కని విధంగా వ్యవహరిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వాన్ని సమర్థించేవారి కంటే ఆయనను వ్యతిరేకించే వారు ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తున్నారు.  

 

మొదటి నుంచి కన్నా జగన్ ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే, బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు జగన్ కు మద్దతుగా మాట్లాడుతూ టిడిపి పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కూడా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇలా బీజేపీ నాయకులంతా టీడీపీకి, వైసిపి కి మద్దతుగా వ్యవహరిస్తూ వస్తున్నారు తప్ప, పార్టీని బలోపేతం చేసి అధికారం సాధించే దిశగా తీసుకెళ్లడంలో మాత్రం విఫలమవుతున్నారు. అసలు ఏపీ బీజేపీ అంటేనే ఏదో ఒక పార్టీకి భజన చేసేదిగా పేరు సంపాదించుకుంది. అందుకే ఇక్కడ బిజెపి ఎదగకపోవడానికి కారణం అని విశ్లేషకులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: