కరోనా వైరస్ మానవాళి జీవన గమనాన్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. మానవాళి మనుగడను ఒక కుదుపు కుదిపేసింది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిమందిని పొట్ట‌న‌బెట్టుకుంది. సుమారు అర‌కోటిమంది ఈ వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఇక‌ ఇది సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి ఎన్నో గుణ పాఠాలు నేర్చుకునేందుకు మనుషులు రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అనేక రంగాలు మార్పులు చెందుతున్నాయి. ఇందులో ప్రధానంగా కరోనా వైరస్ వలన మానవుడు మూడు ప్రధాన అంశాలను పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేనిపక్షంలో దాని బారిన పడి మృత్యుఒడిలోకి చేరుకోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి మందులూ లేని కరోనా వైరస్ బారినుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలి.. మాస్కు ధరించాలి.. చేతులను నిత్యం శానిటైజ్‌ చేసుకోవాలి.. ఈ మూడు అంశాలను మనిషి పట్టించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిత్యం ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌లో ఉండ‌లేరు. మనిషి కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

 

తనను తాను కాపాడుకుంటూనే అవసరమైన పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇందులో ప్రధానంగా మనం పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తప్పకుండా శానిటైజ‌ర్‌ వాడాల్సి ఉంటుంది. అందుకే వ్యాపార రంగాలు కూడా అందుకు తగ్గట్టుగానే శానిటైజ‌ర్ల‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం పెద్ద‌పెద్ద శానిటైజ‌ర్‌ బాటిళ్ల‌నే చూస్తున్నాం. దీనిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో షాంపుల ప్యాకెట్ల‌ మాదిరిగానే కూడా చిన్న చిన్న ప్యాకెట్లలో శానిటైజ‌ర్ల‌ను అందించేందుకు వ్యాపార సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చిన్నచిన్న ప్యాకెట్లను అయితే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి నిత్యం చేతులను శానిటైజ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క శానిటైజ‌ర్ల విష‌యంలోనే కాదు.. మిగ‌తా రంగాల్లో కూడా మౌలిక మార్పులు వ‌స్తాయ‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: