తెలుగుదేశం పార్టీ పగ్గాలు మెల్లగా నందమూరి చేతుల్లో నుంచి నారా వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇక భవిష్యత్తులో చంద్రబాబు నుంచి లోకేష్ కి పార్టీ పగ్గాలు బదిలీ కావడమే తరువాయి. నిజానికి లోకేష్ కి పార్టీ అధ్యక్ష కిరీటం తొడగాలని ఆయన వర్గం గొడవ చేస్తోంది. అయితే సీనియర్లు మాత్రం చంద్రబాబే మరికొన్నాళ్ళు టీడీపీ ప్రెసిడెంట్ గా ఉండాలని కోరుతున్నారు.

 

ఈ నేపధ్యంలో నారా లోకేష్ ని పార్టీలో మరింత కీలకం చేయడానికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేయడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు. టీడీపీలో చంద్ర‌బాబే అసలు బాస్. కానీ ఇపుడు కరోనా వేళ బాబు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు.

 

దాంతో పాటు లోకేష్ ని ఇలాగే ఉంచితే ఆయన మాట పార్టీ నాయకులు వినరు. అందువల్ల కుమారుడికి పార్టీలో విశేష ప్రాధాన్యత కల్పిస్తూ రాబోయే కాలానికి కాబోయే అధినేత ఆయనేనని చెప్పడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తులలో భాగమే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. చినబాబు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న మాటేకానీ సర్వం సహా ఆయనే  అన్నట్లుగా రాబోయే రోజుల్లో సీన్ ఉంటుందని అంటున్నారు.

 

ఈ కొత్త పదవిని చినబాబుకు అప్పగించడం, ఆయన టీంని పార్టీలోకి తీసుకుని యువ నాయకులతో పార్టీని నింపడం వంటివి చేయడం ద్వారా టీడీపీకి కొత్త ఊపు తీసుకువస్తారని అంటున్నారు. మహానాడు వేదికగా ఈ మార్పులు ఉంటాయని చెబుతున్నారు.  ఈసారి మహానాడు జూం వీడియో ద్వారానే జరుగుతుందని అంటున్నారు.

 

ఎక్కడి నాయకులు అక్కడే ఉంటూ ఈ కొత్త నియామకాలు, పార్టీలో వచ్చే మార్పులను వీక్షిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ పగ్గాలు లోకేష్ కి అందించడం ద్వారా చంద్రబాబు తన బరువు కొంత దించుకుంటున్నారా లేక జగన్ వంటి యువ నేతను ఎదుర్కోవడానికి యువ రక్తాన్ని అందిస్తున్నారా అన్నది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: