ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలి‌సిందే. క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిక‌ర్త అనే ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న చైనా, మ‌న దేశం విష‌యంలో వివిధ ర‌కాల అంచ‌నాలు వెలువ‌డ్డాయి. చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లిపోతాయ‌ని, అవి ఇండియాలోకి వ‌స్తాయ‌ని జోస్యం చెప్పాయి. ఇలాంటి స‌మ‌యంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. సందట్లో సడేమియా అన్నట్టు భారత్ నుంచి కరోనా కల్లోలంలో 1600 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో అయితే రూ.1.2 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వెనుకకు వెళ్లాయి.

 

`ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం` పేరుతో అమెరికా కాంగ్రెస్ పరిశోధనా కేంద్రం నివేదిక రూపొందించింది. యూరప్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, స్పెయిన్ దేశాల్లో 3 కోట్ల మంది ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా జీడీపీ 2020 తొలి త్రైమాసికంలో 4.8 శాతం తగ్గిందని నివేదికలో తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఆసియా దేశాల నుంచి మొత్తంగా 2600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనుకకు వెళ్లాయని స్ప‌ష్టం చేసింది. అయితే, భార‌త్ ఓ అంచ‌నా వేసుకోగా ప‌రిస్థితులు ఇలా మార‌డం గ‌మ‌నార్హం. చైనా నుంచి వ‌చ్చే పెట్టుబ‌డులపై ఆశ పెట్టుకున్న త‌రుణంలో ఇలాంటి ప‌రిణామం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయ‌నుంద‌ని అంటున్నారు.

 

మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది క‌టిక పేదరికంలోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌పంచ బ్యాంకు హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది అయిదు శాతం ప‌డిపోనున్న‌ట్లు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అధ్య‌క్షుడు డేవిడ్ మ‌ల్‌పాస్ తెలిపారు. కోవిడ్‌19 వ‌ల్ల ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, వ్యాపారాలు కూడా దెబ్బ‌తింటున్నాయ‌ని అ‌న్నారు. పేద దేశాల‌కు వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంద‌న్నారు. ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధి నాశ‌న‌మైంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య ‌వ్య‌వ‌స్థ కూడా తీవ్ర కుదుపుకు గురైన‌ట్లు ఆయ‌న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: