కరోనా వైరస్ తో గజగజ లాడుతున్న రాష్ట్రాలకు అంఫాన్ తుఫాన్ రూపంలో పెను ముప్పు వస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్ర పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత రెండు రోజులకే అంఫాన్ ప్రభావం పెద్దగా ఉండదని తన దిశ మార్చుకుని వేరే వైపు వెళ్తుందని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా అంఫాన్ తుఫాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో చాలా స్పష్టంగా కనబడింది. ఈదురు గాలులు వీచిన దాటికి చెట్లు మరియు ఇళ్లు నేలమట్టమయ్యాయి.

 

ఉప్పాడ తీరంలో చాలా ఇల్లు తుఫాను ప్రభావానికి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో రాకాసి అలలు ఎగిసి పడటంతో కాకినాడ లోని ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసం అయింది. దీంతో వెంటనే అటు వైపు వెళ్లాల్సిన వాహనాలను, రాకపోకలను పోలీసులు ఆపేయటం జరిగింది. కాకినాడలో కొన్నిచోట్ల ఇళ్లల్లోకి సముద్రపు నీరు రావడం జరిగింది. దీంతో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వ అధికారులు అప్రమత్తం కావడంతో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

మొత్తం మీద అంఫాన్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై గట్టిగానే చూపించింది. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ దక్షిణంగా 180 కిలోమీటర్ల దూరంలో దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య అంఫాన్ తీరం దాటే క్రమంలో తీరం వెంబడి దాదాపు 170 నుంచి 200 కిలోమీటర్లు మేరకు తుఫాను గాలులు భయంకరంగా వీచడంతో సముద్రాలు అలజడి గా మారాయి. సుమారు నాలుగు గంటలపాటు సుందర్బన్ వద్ద దాటిన ఈ తుఫాను భయంకరమైన ఈదురుగాలులతో రెచ్చిపోయింది. బంగ్లాదేశ్ వైపు వెళ్లిన అంఫాన్ అక్కడ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: