కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే అనేక దేశాలు ముంద‌డుగు వేశాయి. తాజాగా.. వ్యాక్సిన్‌ తయారీలో మరో ముందడుగు వేసింది హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ. ఎలుకలపై తాము చేసిన ప్రయోగం సత్ఫలితాన్నిచ్చిందని, డిసెంబర్‌లోపు మనుషులపై ప్రయోగాలకు సన్నాహాలు చేస్తున్నామని బుధవారం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ తయారీకి భారత్‌ బయోటెక్‌సంస్థ, అమెరికాకు చెందిన జఫర్సన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిలడెల్ఫియా సంయుక్తంగా వ్యాక్సిన్‌ తయారీకోసం తమ ప్రయోగాలను ముమ్మరం చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే జంతువులపై తమ ప్రయోగాలు పూర్తయ్యాయని, వచ్చే నెలలో ఫలితాలు వచ్చే అవకాశముందని తెలిపాయి. రేబిస్‌ వ్యాక్సిన్‌ను నిర్వీర్యంచేసి దానిలోని మూలాలతో కొత్త వ్యాక్సిన్‌ను తయారుచేసి జంతువులపై ప్రయోగించామని, ఆ ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని జఫర్సన్‌ వర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్‌ మిత్తయిస్‌ సచ్‌నెల్‌ తెలిపారు. ర్యా బిస్‌ వ్యాక్సిన్‌ను డియాక్టివేట్‌ చేసి కరోనా ప్రొటీన్స్‌తో దానికి విరుగుడు కనుగొంటున్నామన్నారు.

 

ఈ విధానంలో బలమైన వ్యాక్సిన్‌ను తయారు చేయవచ్చని, ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదముద్ర ఉందని తెలిపారు. తాము తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు కోరోఫ్లూ అని ఇదివరకే పేరు పెట్టారు. ఎలుకపై జరిపిన ప్రయోగంలో బలమైన యాంటిబాడీ తయారైందని సంస్థ తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ను జంతువులపై జరిపిన ప్రయోగ ఫలితాలు వచ్చే నెలలో వచ్చే అవకాశముందని పేర్కొంది. ఈ ఫలితం వచ్చిన వెంటనే మొదటిదశ క్లినికల్‌ ట్రయల్‌కు వెళ్తామని ప్రొఫెసర్‌ సచ్‌నెల్‌ తెలిపారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఈవో డాక్టర్‌ కృష్ణమోహన్‌ స్పందిస్తూ భారత్‌ బయోటెక్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను కనుగొనడంలో విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇక్కడినుంచే సరఫరా, మార్కెటింగ్‌ చేసుకొనే అవకాశం దక్కుతుందన్నారు. భారత ప్రభుత్వ సహకారంతో ఈ సంవత్సరం డిసెంబర్‌ లోపలే మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాలనే లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఆయ‌న అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: