ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు సీఎం జగన్ కు సహకరిస్తానన్నారు. ఏ విషయంలోనో తెలుసా.. కృష్ణా జలాల వినియోగం విషయంలో. ఈ విషయంలో కొత్తగా ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇష్యూ ఇంతగా రభస అవుతున్నా ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే ఆయన తాజాగా బుధవారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో స్పందించారు.

 

 

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఈ సర్కారుకు తన సహకారం ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. ఇదే సమయంలో ఆయన జగన్ సర్కారుపై విమర్శలు కురిపించారు.

జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కర్నూలులో దీక్షచేసి కాళేశ్వరం కడితే ఇండియా, పాకిస్ధాన్‌ మధ్య యుద్ధం వచ్చినట్లు అవుతుందని మాట్లాడారని గుర్తు చేశారు. ఆ తర్వాత తానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లి వచ్చాడు అంటూ చంద్రబాబు విమర్శించారు. ఏదైతేనేం మొత్తం మీద పోతిరెడ్డిపాడు మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నోరు విప్పారన్నమాట.

 

 

అయితే ఈ సమయంలో రాయలసీమకు తానే నీళ్లు తెచ్చానని చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు చేశారు. పోతిరెడ్డి ప్రాజెక్టును ఎన్.టి.ఆర్.మొదలు పెడితే తాను పూర్తి చేశానని చంద్రబాబు అంటున్నారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులన్నీ ప్రారంభించింది ఎన్.టి.ఆర్.అని ఆయన అంటున్నారు. అంతే కాదు.. అసలు సీమ నీటి ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు టీడీపీకే ఉందన్నారు చంద్రబాబు.

 

 

గతంలోఎన్.టిఆర్. తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టారని, తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి అన్నీ ఆయనే ప్రారంభించారని చంద్రబాబు చెప్పారు. వాటన్నిటినీ తాము పూర్తి చేశాం అని చెప్పుకున్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అయితే.. ముచ్చుమర్రి రాయలసీమకు జీవనాడి అని... దానిని తాను పూర్తి చేశానని అన్నారు. అదే సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి దాని ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు ఇచ్చామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: