కరోనా ఇండియాలో వ్యాపించడానికి తబ్లిగీ కేసులే ప్రధాన కారణమని దేశంలో నమ్మేవారు చాలా మందే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆ తరహా ప్రచారం జోరుగా సాగింది. కానీ దేశంలో వచ్చిన కేసుల్లో 30 శాతం మాత్రమే తబ్లిగీ ద్వారా వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే.. క‌రోనా వ్యాప్తికి ముస్లింలనే బాధ్యుల‌ని చేయొద్దంటున్నారు తెలంగాణ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు. ఒక‌రిద్దరు చేసిన త‌ప్పుల‌కు అంద‌రినీ బ‌లి తీసుకోవ‌ద్దని.. మ‌న‌ది గొప్ప సంస్కృతి, మ‌తాలేవైనా మ‌న‌మంతా పాలు నీళ్ళలా క‌లిసిపోతామని.... గంగా జ‌మునా త‌హజీబ్ అని అన్నారాయన.

 

 

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగ‌ర మండ‌ల కేంద్రాల్లో ముస్లిం కుటుంబాల‌కు రంజాన్ ప‌ర్వదిన వ‌స్తువుల‌తో కూడిన నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పంపిణీ చేశారు. క‌రోనా వైర‌స్ ని అంతం చేయ‌డం అంత ఈజీ కాద‌ని.. అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు కూడా ఇదే విష‌యాన్నిచెబుతున్నార‌ని అన్నారు. టీకాలు వ‌చ్చినా స‌రే, మ‌నం మ‌రికొన్నేళ్ళు అంటే క‌నీసం ఒక‌టి రెండేళ్ళైనా స‌రే, క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని ఎర్రబెల్లి అన్నారు.

 

 

అలాగని.. క‌రోనాతో పూర్తిగా భ‌య‌ప‌డాల్సింది లేద‌ని, అలాగ‌ని నిర్లక్ష్యంగా కూడా ఉండ‌వ‌ద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజ‌ల‌కు హిత‌వు ప‌లికారు. జ‌లుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి ల‌క్షణాలు క‌నిపిస్తే వెంట‌నే స‌మీపంలోని ప్రభుత్వ వైద్యుల‌ని సంప్రదించాల‌ని సూచించారు. అలాగ‌ని ఈ ల‌క్షణాల‌న్నీ క‌రోనా అనుకోవ‌డానికి లేద‌న్నారు. కొద్దిగా ఇబ్బందిక‌రంగా ఉన్న ప‌రిస్థితి ఇది. దీన్ని అదిగ‌మించ‌డానికి కొద్ది స‌మ‌యం ప‌డుతుంద‌ని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

 

 

ప్రజ‌లు అప్రమ‌త్తంగా, స్వీయ నియంత్రణ‌లో ఉండాల‌ని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ముస్లీంల‌కు ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏ మ‌త సారాంశ‌మైనా ఒక్కటేనని.. తాను అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తానని చెప్పారు. అంద‌రు దేవుళ్ళకు మొక్కుతున్నందువల్లే తాను ఓటమి లేకుండా గెలుస్తున్నానన్నారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: