కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్‌ లోకి వెళ్లిపోయింది. దాదాపు 2 నెలలుగా ఇదే పరిస్థితి. మరి అప్పటి వరకూ అత్యవసర సేవలు మాత్రం ఆగవు కదా. అలాంటి వాటిలో సెలూన్లు ఒకటి. ఇంకా దేశంలో చాలా చోట్ల సెలూన్లు తెరుచుకోలేదు. అలాగని మగాళ్లకు మీసాలు, గడ్డాలు ఆగవు కదా. అందుకే పెరిగిన గడ్డం మీసాలను కొందరు తమ భార్యలతో కట్ చేయించుకుంటున్నారు.

 

 

ఆ మధ్య విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క కటింగ్ చేసేసింది. ఇప్పుడు టెస్టు బ్యాట్స్‌మన్‌ పుజారా భార్య పూజా పబారి కూడా ఈ విషయంలో అనుష్కనే ఫాలో అయ్యింది. ఇంట్లోనే కత్తరె చేతబట్టి భర్త పూజారాకు కటింగ్ చేసింది. ఈ విషయాన్ని పుజారా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసి పంచుకున్నాడు. అదే సమయంలో.. ‘99 పరుగుల వద్ద త్వరగా సింగిల్‌ తీసేందుకు, మీ సహచర బ్యాట్స్‌మన్‌ని నమ్మడం.. లేదా మీ భార్యతో జుత్తు కత్తిరించుకోవడం.. రెండిట్లో ఏది సాహసోపేతమైంది?’’ అంటూ సరదగా నెటిజెన్లకు ఓ ప్రశ్న వదిలాడు.

 

 

ఈ ప్రశ్నకు చాలా మంది తమాషాగా స్పందించారు. కొందరు అసలు ఈ పోస్టు పెట్టడమే అతిపెద్ద సాహసోపేతం అంటూ బదులిచ్చారు. ఇంకొందరు.. భార్యల కన్నా ఇతర బ్యాట్స్‌మెనే నమ్మకస్తులు అని కామెంట్ చేశారు. మరొకతను.. జుత్తు పోతే మళ్లీ పెరుగుతుంది, కానీ టెస్టుల్లో 99 పరుగులు చేయాలంటే చాలా కష్టం.. అని కామెంట్ పెట్టాడు. 99 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేయడమనేది మీ చేతుల్లో ఉంటుంది. ఎలాగైనా బతికిపోవచ్చు. కానీ, ఇక్కడ మరో అవకాశం ఉండదు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అవతలి వారి నిర్ణయాలను ఒప్పుకోక తప్పదన్నాడు మరో నెటిజన్.

 

 

అందరికంటే తమాషాగా ఓ వ్యక్తి ఎంతటి క్రికెటర్ అయినా పెళ్లాం ముందు నోరు మూసుకోవాల్సిందే అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే.. పుజారా సర్‌.. త్వరగా సింగిల్‌ తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఔటైనా అవతలి వ్యక్తిపై అరవొచ్చు. ఇక్కడైతే మన నోరు మూసుకోవాల్సిందే.. అని బదులిచ్చాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: