ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నిన్న 68 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 2407కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 53 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కరోనా సమాచారం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. 
 
సైబర్ నేరగాళ్లు సెర్బెరస్ అనే బ్యాంకింగ్ ట్రోజాన్ ను మొబైల్స్ కు పంపి ఖాతాలలోని డబ్బును దోచేస్తున్నారు. ట్రోజాన్ సహాయంలో క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను చోరీ చేసి ఖాతాలో డబ్బులను మాయం చేస్తున్నారు. ఏపీలోని చాల మందికి కరోనా సమాచారం తెలుసుకోవాలంటూ మొబైల్స్ కు సందేశాలు వస్తున్నాయి. ఆ మెసేజ్ ను పొరపాటున క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలలోని డబ్బులు మాయమయ్యాయి. 
 
కరోనా సమాచారం పేరుతో సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తెచ్చుకుని ఖాతాలలోని డబ్బులను ఖాతాదారులకు తెలియకుండానే దోచేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు సైబర్ మోసాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు అందాయని సమాచారం. సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకుని ప్రజలు ఇలాంటి మోసాల భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 
 
పొరపాటున లింక్ లను క్లిక్ చేసినా యాప్ ఇన్‌స్టాల్‌ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించొద్దని చెప్పారు. మొబైల్స్‌ కాంటాక్ట్స్‌, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఇప్పటికే యాప్ ను ఇన్‌స్టాల్‌ చేస్తే ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి ఫోన్‌ను రీసెట్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం అయితే వెంటనే బ్యాంక్ అధికారులకు, సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: