చంద్రబాబు ప్రెస్ మీట్ అంటేనే అదో గంటల తరబడి వ్యవహారం.. డైరెక్టుగా ప్రెస్ మీట్ పెట్టినా జూమ్ యాప్ ద్వారా లైవ్ ఇచ్చినా.. ఏదైనా సరే.. గంటలకు గంటలు మాట్లాడాల్సిందే. అదే చంద్రబాబు స్టయిల్. తాజా బుధవారం కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. యథాప్రకారం జగన్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. కరోనాను కట్టడి చేయడంలో జగన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని మండిపడ్డారు.

 

 

తాను మొదటి నుంచి సలహాలు ఇస్తున్నా తన మాటలను పట్టించుకోకపోవడం వల్లే ఏపీకి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇలా ఎన్నో విమర్శలు చేశారు. కానీ.. తాను హైదరాబాద్ వదిలి ఏపీకి వస్తానని మాత్రం చెప్పలేదని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తాను ఆంధ్రలో లేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను మాత్రం చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు. తాను లేకపోతేనేం తమ పార్టీ నేతలు అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు.

 

 

అంతేకాదు.. విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితుల పరామర్శకు టీడీపీ నేతలు వెళ్తే రానివ్వలేదని విమర్శించారు. అంతేనా.. మడ అడవుల సందర్శనకు వెళ్లినా అడ్డుకున్నారని విమర్శించారు. ఆవ భూము ల అవినీతి చూడకుండా ఆపు చేశారన్నారు. తాను రాష్ట్రంలో లేకపోయినా తన మనసు అక్కడే ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తూనే ఉన్నానని చంద్రబాబు చెప్పారు.

 

 

అంతేకాదు.. తన ప్రశ్నలకు జవాబివ్వలేక జగన్‌ పారిపోతున్నారని, ఏ ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వగలిగిన తాను ధైర్యంగా ముందుకొస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. మరి తన ప్రజలు కష్టాల్లో ఉంటే తాను మాత్రం హైదరాబాద్ లో ఎందుకు ఉండిపోయారో మాత్రం చంద్రబాబు చెప్పలేదు. తాను హైదరాబాద్ వదలి ఏపీకి వచ్చి మీ కష్టాలు పరిశీలిస్తా అని మాత్రం ధైర్యం చెప్పలేదు చంద్రబాబు. ఎందుకో మరి. ఆయన ఏపీ వచ్చేది ఎప్పుడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: