ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటున్న క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌తో క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌స్తోంది. వైర‌స్ సంక్ర‌మ‌ణ రేట్ దాదాపుగా త‌గ్గిపోయింది. అయితే.. ఈ క్ర‌మంలోనే ఏపీలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. వందే భారత్‌ మిషన్‌-2లో  భాగంగా ఏపీకి చెందిన ప్రవాసులు విదేశాల నుంచి ప్రత్యేక విమానాలలో వస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. వీరిలో కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. బుధవారం ఉదయం లండన్‌ నుంచి 143 మంది ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ బస్‌ విమానంలో, రాత్రి జెడ్డా నుంచి 80 మంది ప్రత్యేక విమానంలో గన్నవరం(విజయవాడ) వచ్చారు. వారిని ఎయిర్‌పోర్టు అధికారులు, ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు, కృష్ణాజిల్లా అధికారులు బస్సులలో ఇంటర్నేషనల్‌ టెర్మిన ల్‌ బిల్డింగ్‌కు తరలించారు. అక్కడ వారి వివరాలతోపాటు ఆరోగ్యసమస్యలు నమోదు చేసుకొన్నారు.

 

అయితే.. ప్రాథ‌మిక‌ పరీక్షలలో ముగ్గురిలో కరోనా లక్షణాలు గుర్తించారు. ఈ ముగ్గురిలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లా వ్యక్తులతోపాటు తెలంగాణకు చెందిన ఒకరు ఉండ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డి నుంచి వారిని నేరుగా జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వారిని ప్రత్యేక బస్సుల్లో ఆయా జిల్లాల్లోనే క్వారంటైన్‌కు తరలించారు. కాగా, లండన్‌ నుంచి వచ్చినవారందరూ పెయిడ్‌ క్వారంటైన్‌కే మొగ్గు చూపారు. ఇదిలాఉంటే తెలం గాణకు చెందిన ఒకరిని అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా పంపించారు. ఆయన తండ్రి చనిపోవటంతో, జీజీహెచ్‌లో పరీక్షలు చేయించుకున్నాక  ఆయ‌న‌ను కారులో పంపించారు. జిల్లా యంత్రాంగ స్థాయిలో కూడా ఒకరిని పంపించారు.

 

అలాగే.. ఖతార్‌ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బుధవారం 149మంది విశాఖ పట్నం చేరుకున్నారు. వీరిలో ఏపీ 138 మంది, కేరళ, ఒడిసా, తమిళనాడు, తెలంగాణకు చెందిన 11మంది ఉన్నారు. ఇప్ప‌టికే ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి వ‌స్తున్న వారిలో కూడా క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డుతోంది. ఇక విదేశాల నుంచి వ‌స్తున్న వారిలో కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌డంతో అధికారులు మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: