అందరి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చే సాధనం మీడియా.. మీడియాలో ఓ అంశం గురించి ప్రముఖంగా వచ్చిందంటే.. ప్రభుత్వాలు కదులుతాయి. ప్రజాసంఘాలు కదులుతాయి. సమాజంలోనే కదలిక వస్తుంది. చివరకు అది ప్రజాసంక్షేమానికి దారి తీస్తుంది. అందుకే మీడియాను ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభం అంటారు. మొదటి మూడు స్తంభాలుగా చెప్పుకునే వ్యవస్థలన్నీ ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటే.. ఈ నాలుగోస్తంభమే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటుంది.

 

 

అలాంటి మీడియా ఇప్పుడు తన సమస్య గురించి తానే సుప్రీంకోర్టుకు విన్నవించుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఈ సమస్య ఏంటంటే.. మొండి బకాయిలు. అందులోనూ ఈ బకాయిలు ప్రభుత్వాలు చెల్లించాల్సినవే. అనేక ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వాలు ప్రచారం కోసం పత్రికలకు ప్రకటనలు ఇస్తాయి. కానీ ఆ ప్రకటనలకైన సొమ్ములు మాత్రం వెంటనే విడుదల చేయవు. అలా వివిధ ప్రభుత్వాలు బకాయి పడిన మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా 1800 కోట్లట.

 

 

ఈ విషయాన్ని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ వ్యాప్తంగా మీడియాకు కేంద్రం, ఆయా రాష్ట్రాలు పడ్డ బకాయిలు భారీగా ఉన్నట్లు తెలిపింది. మొత్తం మీద కేంద్రంకాని, రాష్ట్రాలు కాని మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయట. అంతే కాదు.. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

 

మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ ఒక అఫిడవిట్‌లో సుప్రీంకోర్టు కు వివరించింది. కరోనా కష్టకాలంలో ఈ బకాయిలు చెల్లిస్తే తాము కాస్త నిలదొక్కుకోగలుగుతామని విన్నవించుకుంటోంది. మరి వీరి విజ్ఞప్తిని అధికారపీఠాల్లో ఉన్న నరేంద్రమోడీ, జగన్, కేసీఆర్ ఆలకిస్తారా.. మోడీ సంగతి ఎలా ఉన్నా.. జగన్, కేసీఆర్ స్వయంగా పత్రికల యజమానులు కూడా. మరి వారైనా అర్థం చేసుకుని ఆదుకుంటారా..చూడాలి.. !

మరింత సమాచారం తెలుసుకోండి: