క‌రోనా క‌ల‌క‌లం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల‌న్నింటిని అత‌లాకుత‌లం చేసేస్తోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయడంతో భారత్‌సహా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల‌న్నీ ఇరుకున ప‌డిపోతున్నాయి. ప్ర‌భుత్వాలు సైతం పెద్ద ఎత్తున్నే త‌మ విధానాల‌ను మార్చుకున్నాయి. మ‌రోవైపు క‌రోనా వైరస్ భ‌యంతో ప్రైవేట్‌ కంపెనీలు పనితీరునే మార్చేసుకున్నాయి. ఈ అంటువ్యాధిని ఎదుర్కొనేందుకు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాయి. ఇన్నాళ్లూ ఇలా చేసిన‌ సంస్థలు.. ఇకపైనా దాన్నే కొనసాగించాలని చూస్తున్నాయి. 

 

కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరంభం నుంచి కొన్ని సడలింపులు ఇవ్వగా, రెడ్‌ జోన్లలో మాత్రం కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ నడుస్తున్న సంగతీ విదితమే. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్‌కు ముందు, త‌ర్వాత ప‌రిణామాలు, వ‌ర్క్ ఫ్రం హోం తీరు గురించి నైట్‌ ఫ్రాంక్‌ నిర్వహించిన తాజా సర్వేలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.  వివిధ రంగాల్లోని భారీ శ్రేణి సంస్థల్లో కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్ట్‌ఫోలియోను చూస్తున్న 230కిపైగా ఉద్యోగుల అభిప్రాయాలను నైట్‌ ఫ్రాంక్‌ ఈ సర్వేలో సేకరించింది. 70 శాతానికి పైగా సంస్థలు వచ్చే ఆర్నెళ్లూ ఇంటి నుంచే ఉద్యోగులను పని చేయించే అవకాశాలున్నట్లు తేలింది. లాక్‌డౌన్‌లో వర్క్‌ ఫ్రం హోమ్‌ వల్ల తమ సంస్థల ఉత్పత్తిపై ఏరకమైన ప్రభావం పడలేదని ఈ సందర్భంగా మెజారిటీ ఉద్యోగులు అన్నారు. 26 శాతం మంది ఉత్పత్తి తగ్గిందన్నారు.

 

భౌతిక దూరం నిబంధనలు, బస్సుల కొరత, ప్రయాణాల్లో ఇబ్బందుల దృష్ట్యా 72 శాతం సభ్యులు వర్క్‌ ఫ్రం హోమ్‌కే మద్దతు పలికారని సర్వే స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల్లో 30 శాతానికిపైగా వచ్చే ఆర్నెళ్లు ఇంటి నుంచే పనిచేస్తారని సర్వేలో పాల్గొన్న దాదాపు 50 శాతం మంది చెప్పారు. కేవలం 7 శాతం మంది ఎవరూ వర్క్‌ ఫ్రం హోం ఉండరని అన్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ తెలియజేసింది. ఇక ప్రస్తుత ఆఫీస్‌ స్పేస్‌ పోర్ట్‌ఫోలియోను యథాతథంగా లేదా 24 శాతం పెంచవచ్చని సుమారు 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా, మారుమూల ప్రాంతాల్లోని ఉద్యోగులతో పని చేయించుకుంటున్న సమయంలో కొంత ఇబ్బంది పడ్డామని ఆయా సంస్థలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: