పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ నిన్న దేశీయ విమాన సర్వీసులను ఈ నెల 25 నుంచి దశలవారీగా పునఃప్రారంభించనున్నట్లు నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల మార్చి 25 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులకు సంబంధించిన విధివిధానాలను విమానయాన శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుందని నిన్న ఆయన తెలిపారు. తాజాగా విమానాశ్రయాల్లో పాటించాల్సిన నిబంధనలు విడుదలయ్యాయి. 
 
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండడంతో కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. ఈ సూచనల్లో విమాన ప్రయాణికులకు ట్యాక్సీలు, ప్రజా రవాణా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని పేర్కొంది. ట్రాఫిక్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ప్రయాణికుల వ్యక్తిగత వాహనాలు, రిజిస్టర్డ్ ట్యాక్సీలను పరిమిత సీటింగ్ తో మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి రెండు గంటల ముందే చేరుకోవాలని... ఆరోగ్య సేతు యాప్ ను ప్రయాణికులు తప్పనిసరిగా ఉపయోగించాలని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలను మాత్రం మినహాయిస్తున్నట్టు ప్రకటన చేసింది. 
 
విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ జోన్లను ఉపయోగించాలని ప్రయాణికులు టెర్మినల్ భవనంలోకి వెళ్లే ముందు థర్మల్ స్క్రీనింగ్ జోన్ నుంచి నడిచి వెళ్లాలని సూచించింది. గుర్తింపు పొందిన పరికరాలను థర్మల్ స్క్రీనింగ్ జోన్ల కోసం ఉపయోగించాలని పేర్కొంది. విమానాశ్రయాల్లోని సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సేతు యాప్ లో గ్రీన్ చూపిస్తే మాత్రమే ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది.  ఏయే రూట్లలో విమానాలు నడవనున్నాయనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దేశీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇవ్వడం పట్ల వివిధ కారణాల వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: