లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణీకుల కోసం రైలు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. irctc వెబ్‌సైట్‌ ద్వారా రికార్డు స్థాయిలో టికెట్లు బుక్కయ్యాయి. తొలి 2 గంటల్లోనే సుమారు లక్షన్నర టికెట్లు బుక్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. టికెట్ ధరలు సాధారణంగానే ఉంటాయన్న రైల్వే బోర్డు.. రైలు సర్వీసులకు గరిష్టంగా 30 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.

 

సుమారు రెండు నెలల లాక్ డౌన్‌ సడలింపుల అనంతరం ... జూన్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ట్రైన్ సర్వీసులు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దురంతో, సంపర్క్ క్రాంతి, జనశతాబ్ది లాంటి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఈ రైళ్లలో నాన్‌ ఎసీతో పాటు ఏసీ తరగతి కూడా ఉంటుందని స్పష్టం చేసింది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్‌ కోచ్‌ల్లోనూ రిజర్వుడు సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్ రుసుములు సాధారణంగా ఉంటాయని.. 30 రోజుల ముందు నుంచి బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

 

200 రైలు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి స్లీపర్‌ క్లాస్‌ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వడంతో... కొద్దిసేపటికే బుకింగ్‌లు వెయిటింగ్‌ లిస్టుకు చేరిపోయాయి. కేటాయించిన టికెట్లు పూర్తయిన తర్వాత 200 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జూన్‌ 1 నుంచి 22వ తేదీ వరకు మాత్రమే రిజర్వేషన్‌ చేసుకోవడానికి రైల్వే శాఖ అనుమతించింది. ప్రస్తుతానికి తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్‌లను పక్కనపెట్టారు. 

 

తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు కూడా పలు రైళ్లు నడవనున్నాయి.  హైదరాబాద్-ముంబై సీఎస్టీ, హుస్సేన్‌సాగర్, ఫలక్‌నుమా, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దానాపూర్ ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇవి కాక ఏపీ ఎక్స్‌ప్రెస్‌, హౌరా-యశ్వంత్‌పూర్, ఎర్నాకులం-నిజాముద్దీన్, సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడపనున్నారు.

 

త్వరలోనే రైల్వే కౌంటర్లు కూడా తెరుస్తామని రైల్వేమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇకపై రైల్వే కౌంటర్ల ద్వారా టికెట్ విక్రయాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 
రైల్వే స్టేషన్లలో కేటరింగ్‌ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లో కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: