కరోనా న్యూ హాట్‌ స్పాట్‌లుగా రష్యా, బ్రెజిల్‌ మారాయి‌. ఈ రెండు దేశాలను కరోనా వణికిస్తోంది. గంటకు గంటకు కేసులు పెరిగిపోతున్నాయి‌. నిర్లక్ష్యమే ఈ రెండు దేశాల పాలిట పెను ప్రమాదంగా మారింది.

 

రష్యాలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనా తీవ్రత విషయంలో రష్యా మరో అమెరికాలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలో ఎక్కడ చూసినా కరోనా కేసులే... రష్యాలోని మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించింది. కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు దానిని విజయవంతంగా కట్టడి చేసిన కొన్ని దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది. వుహాన్‌లో కరోనా విజృంభించక ముందే చైనాతో సరిహద్దులను మూసేసిన రష్యా...లాక్‌డౌన్‌ను కఠినంగానే అమలు చేసింది. అయితే రెండు నెలలు గడిచే సరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. అమెరికా స్థాయిలో  రష్యాలో కూడా కరోనా వేగంగా విస్తరించింది.

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా రష్యా నిలిచింది. అమెరికాతో పోల్చితే  కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా... కేసులు మాత్రం విజృంభిస్తున్నాయి. ప్రతి రోజు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయ్‌. ఇప్పుడు రష్యాలో పాజిటివ్‌ బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. 2 వేల 972 మంది కరోనాకు బలయ్యారు. రష్యా...రాజధాని మాస్కో మొత్తం కరోనా వ్యాపించింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనే ఉన్నాయి. వారం రోజుల క్రితం వరకు మాస్కో చుట్టు పక్కాల ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్...ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించింది. రష్యాలో 11 టైమ్ జోన్స్ ఉంటే... అన్నింటా కరోనా కేసులున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా వ్యాపించడం పుతిన్ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది.  

 

మరోవైపు లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌పై కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో 13 వందల మంది కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 18 వేలు దాటింది. బ్రెజిల్‌లో ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మూడు రోజులుగా బ్రెజిల్‌లో మహమ్మారి తీవ్రత ఉధృతమవుతోంది. అత్యధిక కేసులు నమోదైన జాబితాలో బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీని అధిగమించి బ్రెజిల్‌ మూడో స్థానానికి చేరింది. అక్కడి అధ్యక్షుడు నిర్లక్ష్యమే కరోనా ఇలా వ్యాపించడానికి కారణమైంది. ఆర్థిక పరిస్థితుల మీదే దృష్టి సారించిన బ్రెజిల్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి‌.

మరింత సమాచారం తెలుసుకోండి: