కోవిడ్ -19 కాకుండా అదే లక్షణాలతో కొత్త వైరస్ ఒకటి విజృంభిస్తోందా?. తాజాగా చైనా ఈశాన్య ప్రాంతంలో విస్తరిస్తున్న వైరస్.. వుహాన్‌లో బయట పడిన వైరస్‌కు భిన్నంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొత్తగా విస్తరిస్తున్న వైరస్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ కొత్త వైరస్ విస్తరించడం మొదలైతే అంతా అల్లకల్లోలమే అంటున్నారు చైనా వైద్యులు. 

 

చైనాలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. వుహాన్‌లో వైరస్‌ను అదుపు చేసిన చైనా నాయకత్వం... కొత్తగా వస్తున్న కేసుల్ని చూసి వణికిపోతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో వైరస్ జన్యు రూపంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఇది కొవిడ్ -19కి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌లా ఉందంటున్నారు వైద్యులు. కొత్తగా నమోదవుతున్న కేసులను చూస్తే వైరస్‌ మార్పు చెందుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

వూహాన్‌లో పుట్టిన వైరస్‌కు తాజాగా ఈశాన్య చైనాలో వెలుగుచూస్తున్న వైరస్‌ చాలా భిన్నంగా ఉన్నట్టు చైనా వైద్యులు గుర్తించారు. చైనా ఉత్తర ప్రావిన్స్‌లోని జిలిన్‌, హీలాంగ్‌జియాంగ్‌లో కొత్తగా నమోదైన కరోనా రోగుల్లో వైరస్‌ చాలాకాలం బతికి ఉంది. ఈ వైరస్ సోకిన వారు కోలుకోవడానికి పట్టిన కాలం కూడా  వుహాన్‌లో వైరస్ బాధితులతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని న్యూక్లియర్ యాసిడ్ పరీక్షల్లో గుర్తించినట్లు  చైనాలో ప్రముఖ వైద్యనిపుణుడు క్వి హైబో తెలిపారు. వైరస్‌ సోకిన చాలాకాలం వరకు లక్షణాలు బయటపడడం లేదని, బాధితుడిని గుర్తించేలోపే వైరస్‌ విపరీతంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

 

ఈ తరహా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. వూహాన్‌లో బయటపడిన వైరస్‌ వల్ల ఎక్కువ మందికి గుండె, కిడ్నీ, పేగు సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. రష్యా నుంచి చైనా వచ్చిన వారిలోని వైర్‌సలో ఈ తరహా లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. వుహాన్‌లో వైరస్ అదుపు చేసిన తర్వాత.. చైనాలో మళ్లీ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా చైనా ఈశాన్య ప్రాంతంలో 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది.

 

 చైనీయుల్లో వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చాలా తక్కువ. కొత్తగా విస్తరిస్తున్న వైరస్ చాపకింద నీరులా సైలంట్‌గా విస్తరిస్తూ ఉండటం  అది నేరుగా ఊపిరితిత్తుల మీదే దాడి చేయడం వంటివి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. వుహాన్‌లోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండటం చైనా పాలకుల్ని భయపెడుతోంది. కొత్తగా వైరస్ సోకుతున్న వారిలో లక్షణాలు  బయటపడకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. చైనాలో ప్రస్తుతం కనిపిస్తున్న సెకండ్ వేవ్..  విదేశాలతో పోలిస్తే చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.  ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో అధికారులు ఉదాసీనంగా ఉండకూడదని చైనా ప్రభుత్వ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ జోంగ్ నాన్సన్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: