కరోనా, లాక్ డౌన్, విద్యుత్ బిల్లులపై రగడ, పోతిరెడ్డిపాడు ఇష్యూ ఇలా వరుసగా ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక పలు అంశాలపై టీడీపీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తుంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా పెద్ద ఎత్తునే జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని మరో అంశం రాజకీయాలని రగిలేలా చేయనున్నట్లు కనిపిస్తోంది.

 

స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనాతో పెండింగ్‌లో పడిన రాజధాని తరలింపు అంశం మళ్ళీ తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. ఈ నెలాఖరు లోపు గానీ, జూన్ మొదటివారంలో గానీ అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తారని తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లు మండలిలో పెండింగ్ లో పడటం, అటు మండలి రద్దు అంశం కూడా పెండింగ్ లో ఉండటం, రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు వేసిన పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో విశాఖకు రాజధాని తరలింపు జరగలేదు.

 

అయితే హైకోర్టు ఆదేశాలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నెలాఖరు నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రాజధాని తరలింపు గురించి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపునకు రూ. 100 కోట్లకు మించి ఖర్చు కాదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ పాయింట్ బట్టి చూస్తే రాజధాని తరలింపు త్వరలోనే జరుగుతుందని అర్ధమవుతుంది.

 

ఇక కరోనా వచ్చినా, విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగినా హైదరబాద్ నుంచి ఏపీలో కాలు పెట్టని చంద్రబాబు అమరావతి తరలింపు అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు చెప్పినట్లు రాజధాని తరలింపు అంటే దాన్ని అడ్డుకోవడానికి బాబు ఏపీకి వచ్చేందుకు చూస్తారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ రాజధాని తరలింపు ప్రక్రియ ఎప్పటి లోపు జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: