భారత్‌, నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

భారత్‌, నేపాల్‌ల మధ్య సరిహద్దు రగడ కొనసాగుతోంది. భారత్‌లోని భూభాగాలను తమ ప్రాంతాలుగా ప్రకటించుకుంది నేపాల్‌. సరిహద్దుల్లోని కాలాపానీ, లిపూలేఖ్, లింపియాధురా ప్రాంతాలపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. భారత్‌ అధీనంలో ఉన్న తమకు చెందినవేనని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ప్రకటించారు.  రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

 

అంతటితో ఆగకుండా మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా పేర్కొంటూ మ్యాప్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌ను నేపాల్‌ క్యాబినెట్‌ ఆమోదించింది. నేపాల్‌ ప్రభుత్వం  విడుదల చేసిన మ్యాప్‌పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని, చారిత్రిక ఆధారాలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. ఈ చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. 

 

అంతకు ముందు భారత్‌-నేపాల్ మధ్య కొత్త రహదారి మార్గం అంతరాలు సృష్టించింది.‌ టిబెట్‌లోని మానస సరోవర్‌‌ను చేరుకోవడానికి వీలుగా భారత్ నిర్మించిన లిపులేఖ్‌ మార్గంపై నేపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దులపై వివాదాలు సృష్టించడంతో ఆగని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కూడా భారతే కారణమని ఆరోపించారు. భారత్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ మరింత ప్రమాదకారిగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతానికి పూర్తి భిన్నంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు భారత్‌కు తలనొప్పిగా మారింది. మొత్తానికి నేపాల్ మ్యాప్ పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ లో తమ భూభాగాలను చూపించడంపై మండిపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: